స్ట్రీమ్ ఎంగేజ్ : 1947 నాటి ప్రేమ కథ

స్ట్రీమ్ ఎంగేజ్ :  1947 నాటి ప్రేమ కథ

1947 నాటి ప్రేమ కథ


టైటిల్‌: జూబిలి, కాస్ట్‌: అపర్‌శక్తి ఖురానా, ప్రసేన్‌జిత్ ఛటర్జీ, అదితీ రావ్ హైదరి, వామికా గబ్బి, సిధాంత్, రామ్ కపూర్, నందీష్ సింగ్  సంధు, శ్వేతా బసు ప్రసాద్, లాంగ్వేజ్: హిందీ, ఫ్లాట్‌ఫాం: అమెజాన్ ప్రైమ్ వీడియో, డైరెక్షన్‌: విక్రమాదిత్య మోత్వానే

శ్రీకాంత్ రాయ్ (ప్రసేన్​జిత్​ ఛటర్జీ) ‘రాయ్ టాకీస్‌’ అనే ప్రొడక్షన్​ హౌజ్​ నడుపుతుంటాడు. ఒక వ్యక్తికి మదన్​కుమార్​ అనే పేరు పెట్టి, సూపర్​ స్టార్​ని చేయాలి అనుకుంటాడు శ్రీకాంత్​. అందుకు తగ్గ వ్యక్తి కోసం చాలా రోజులు వెతుకుతారు. చివరికి ఆడిషన్స్​లో మదన్​కుమార్ పాత్ర కోసం జంషెడ్​ ఖాన్ (నందీష్ సింగ్ సంధు)ని ఎంపిక చేస్తారు. అయితే.. అనుకోకుండా జంషెడ్​​తో శ్రీకాంత్​ రాయ్​ భార్య సుమిత్రా కుమారి (అదితి రావు హైదరి) లేచిపోతుంది. వాళ్ల కోసం శ్రీకాంత్​ వెతకడం మొదలుపెడతాడు. చివరికి వాళ్లు లక్నోలో ఉన్నారని తెలిసి, వాళ్లని ముంబైకి తీసుకొచ్చే పనిని బినోద్ దాస్ (అపర్‌ శక్తి ఖురానా)కు అప్పగిస్తాడు. కానీ.. సుమిత్రాని మాత్రమే తీసుకొస్తాడు బినోద్​. తర్వాత అతనే మదన్​కుమార్​గా సినిమాలో నటిస్తాడు. మరయితే జంషెడ్​ ఏమయ్యాడు? మదన్​కుమార్​గా బినోద్​ని ఎందుకు సెలక్ట్​ చేశారు? అనేది సిరీస్​ చూసి తెలుసుకోవాల్సిందే. 
ఈ కథలో వీళ్లతో పాటు దేశ విభజన అప్పుడు కరాచీ నుంచి ఇండియాకు శరణార్థిగా వచ్చిన  జై ఖన్నా (సిధాంత్ గుప్తా), నిలోఫర్ ఖురేషి (వామికా గబ్బి), బినోద్​ భార్యరత్న(శ్వేత బసుప్రసాద్​) పాత్రలకు కూడా ఇంపార్టెన్స్​ ఉంది. అందరూ బాగా నటించారు. ముఖ్యంగా బినోద్​ పాత్రలో అపర్​శక్తి ఖురానా మెప్పించాడు. 

పిపిల్లాడి ప్రేమ

టైటిల్‌: చుపా, కాస్ట్‌: ఇవన్ విట్టెన్, నికోలస్ వెర్డుగో, యాష్లే సియార్రా, డెమియాన్ బిచిర్, క్రిస్టియన్​ స్లేటర్​ 
లాంగ్వేజ్: ఇంగ్లిష్​, ఫ్లాట్‌ఫాం: నెట్​ఫ్లిక్స్, రన్​ టైం: 98 నిమిషాలు, డైరెక్షన్‌: జోనస్​ క్యూరోన్

అలెక్స్ (ఇవన్ విట్టెన్) వాళ్ల నాన్న చనిపోతాడు. దాంతో అతను బాగా బాధపడుతుంటాడు. కొన్ని రోజులు వేరే ప్లేస్​లో ఉండడం బెటర్​ అనుకుంటాడు. మెక్సికోలో ఉన్న తాత దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషానికి కారణం.. తాత చావా (డెమియాన్ బిచిర్),  కజిన్స్​ మెమో (నికోలస్ వెర్డుగో), ల్యూనా (యాష్లే సియార్రా), చుపా అని పిలుచుకునే ఒక అందమైన వింత జీవి. అలెక్స్​కు వాళ్లంతా దగ్గరవుతారు. చుపా మీద చాలా ఇష్టం పెంచుకుంటాడు. దాన్ని తన ఫ్యామిలీతో కలపాలి అనుకుంటాడు. అందుకు అలెక్స్​ ఏం చేశాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

అనామిక ఎవరు? ​ 


టైటిల్‌: రోమాం​చమ్​, కాస్ట్‌:  సౌబిన్ షాహిర్, అనంతరామన్, సాజిన్ గోపు, అబిన్ బినో, సిజు సన్నీ, అఫ్జల్ పీహెచ్, జగదీష్, అర్జున్ అశోకన్, లాంగ్వేజ్: మలయాళం, తెలుగు, ఫ్లాట్‌ఫాం: డిస్నీ+ హాట్​స్టార్​ , రన్​ టైం: 132 నిమిషాలు, డైరెక్షన్‌: జీతు మాధవన్​.

జీవన్ (సౌబిన్ షాహిర్) హాస్పిటల్​ బెడ్​ మీద ఉంటాడు. స్పృహలోకి రాగానే తన ఫ్రెండ్స్​ని చూడాలని ఉంది అంటాడు. రెండు రోజుల తర్వాత మరో రూమ్​కి షిఫ్ట్​ చేస్తారు. అప్పుడు కలవచ్చు అంటారు అక్కడి వాళ్లు. జీవన్​ నర్సుతో తన ఫ్లాష్​ బ్యాక్​ చెప్పడం మొదలుపెడతాడు. బెంగళూరు సిటీ శివార్లలో ఉన్న ఒక ఇంట్లో జీవన్​ తన ఫ్రెండ్స్​ రవి (అనంతరామన్ అజయ్), నీరజ్ (సజిన్ గోపు), ముఖేష్ (సిజు సన్నీ), కార్తీక్ (అఫ్జల్ పీహెచ్), సోమరాజు (జగదీష్), శివాజీ (అబిన్ బినో)తో కలసి ఉంటాడు. వాళ్లంతా మంచి ఫ్రెండ్స్​. బ్యాచిలర్స్ కావడంతో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. జీవన్​ ఒకరోజు తన ఫ్రెండ్స్ రూమ్​లో ఓజా(ఆత్మలను రప్పించే స్పిరిట్ బోర్డ్) ఆడడం చూసి, తన రూమ్​లో కూడా ఆడతాడు. ఆ బోర్డ్​తో జీవన్ ఒక ఆత్మను రప్పిస్తాడు. రోజూ రాత్రి దాంతో టైంపాస్​ చేస్తుంటారు. కొన్ని రోజులకు రూమ్​లో విచిత్రమైన ఇన్సిడెంట్స్​ జరుగుతుంటాయి. దాంతో గేమ్​ ఆడడం ఆపేస్తారు. అప్పుడే ఆ రూమ్​లోకి జీవన్​ ఫ్రెండ్ శ్రీను(అర్జుణ్​ అశోకన్​) వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఆత్మ ఎవరిది? జీవన్​ హాస్పిటల్​లో ఎందుకున్నాడు? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. 


రోమాంచమ్​ సినిమా చూస్తే గూస్​ బంప్స్​ వస్తాయి. 2007లో బెంగళూర్ సిటీలో ఉంటున్న ఏడుగురు ఫ్రెండ్స్​ లైఫ్​లో ఎదురైన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అందరూ బాగా చేశారు. సినిమా బోర్​ అనిపిస్తుంది అనుకున్న ప్రతిసారి ఒక సర్​ప్రైజ్​ ట్విస్ట్​ ఇచ్చాడు డైరెక్టర్​. ఆత్మను అడిగే ప్రశ్నలు కొన్ని కామెడీగా ఉంటాయి. ఒక పక్క నవ్విస్తూ మరో పక్క భయపెడుతుంది కూడా.