V6 News

ఇండియా నుంచి బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్ వచ్చినయ్: సెనేట్ సబ్ కమిటీకి యూఎస్ ట్రేడ్ ప్రతినిధి వెల్లడి

ఇండియా నుంచి బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్ వచ్చినయ్: సెనేట్ సబ్ కమిటీకి యూఎస్ ట్రేడ్ ప్రతినిధి వెల్లడి

వాషింగ్టన్: అమెరికాకు ఇండియా బెస్ట్ ట్రేడ్ ఆఫర్లను ఇచ్చిందని సెనేట్ సబ్ కమిటీకి యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమీసన్ గ్రీర్ వెల్లడించారు. భారత వ్యవసాయ మార్కెట్‌‎లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతించేందుకు వీలుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మంగళవారం సెనేట్ అప్రోప్రియేషన్స్ సబ్ కమిటీకి ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. అగ్రి ట్రేడ్ విషయంలో ఇండియా నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాకు మంచి ఆఫర్స్ వచ్చాయని.. ప్రధానంగా జొన్న, సోయా ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ లభించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

ప్రస్తుతం యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ టీమ్ ఢిల్లీలోనే ఉండి, ట్రేడ్ డీల్ పై చర్చలు జరుపుతోందన్నారు. కొన్ని పంట ఉత్పత్తుల వాణిజ్యం విషయంలో ఇండియా నుంచి వ్యతిరేకత ఉండేదని, కానీ తాజాగా ఇండియా నుంచి సానుకూల వైఖరి కనిపిస్తోందని చెప్పారు. అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు చైనాలో డిమాండ్ హెచ్చుతగ్గులుగా మారిన నేపథ్యంలో ఇండియా ప్రత్యామ్నాయ మార్కెట్​గా నిలుస్తుందన్నారు.