తెలంగాణ జిల్లాల్లోనే మెరుగైన వైద్యం

తెలంగాణ జిల్లాల్లోనే మెరుగైన వైద్యం
  •     డాక్టర్లను సిటీ నుంచి జిల్లాలకు పంపిన సర్కారు
  •     ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఎంఆర్‌‌‌‌ఐ, సీటీ స్కాన్  సేవలు
  •     మెషీన్లు కొనాలని అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
  •     సిటీలోని హాస్పిటళ్లలో వారం రోజుల్లో 407 పోస్టుల భర్తీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్పిటళ్ల అభివృద్ధిపై సర్కారు ఫోకస్  చేసింది. హైదరాబాద్‌‌లో ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద దవాఖాన్లలో అందే వైద్యసేవలను, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని దవాఖాన్లలోనే అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇటీవల జరిగిన జనరల్  ట్రాన్స్‌‌ఫర్లలో హైదరాబాద్‌‌లోని హాస్పిటళ్ల నుంచి సీనియర్  డాక్టర్లను జిల్లాల్లోని హాస్పిటళ్లకు బదిలీ చేసింది. త్వరలోనే అన్ని హాస్పిటళ్లలో ఎంఆర్‌‌‌‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

 ఈ మేరకు ఎంఆర్‌‌‌‌ఐ మెషీన్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. అలాగే, అన్ని మెడికల్  కాలేజీల్లో సీటీ స్కాన్  సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మెడికల్  కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్  ప్రొఫెసర్లు ఈ కాలేజీల్లో పనిచేస్తున్నారు. 

కానీ, మౌలిక వసతుల కొరత కారణంగా పెద్దపెద్ద సర్జరీలు ఆయా హాస్పిటళ్లలో జరగడం లేదు. సర్జరీలు అవసరం అవుతున్న పేషెంట్లను హైదరాబాద్‌‌లోని గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అవసరమైన అన్ని వసతులు కల్పించి, పేషెంట్లకు స్థానికంగానే స్పెషాలిటీ వైద్యసేవలను అందించాలని నిర్ణయించారు.

త్వరలో రిక్రూట్‌‌మెంట్

ఇటీవల జరిగిన ట్రాన్స్‌‌ఫర్లలో హైదరాబాద్‌‌లోని గాంధీ, ఉస్మానియా సహా ఇక్కడి 7 ప్రధాన హాస్పిటళ్ల నుంచి అన్ని డిపార్ట్‌‌మెంట్లలో 40 శాతం మంది డాక్టర్లను బదిలీ చేశారు. అయితే, అంతే మొత్తంలో జిల్లాల నుంచి హైదరాబాద్‌‌కు ట్రాన్స్‌‌ఫర్లు జరగలేదు. ఉదాహరణకు ఇక్కడి నుంచి నలుగురిని జిల్లాల్లోని దవాఖాన్లకు పంపిస్తే, జిల్లాల్లోని దవాఖాన్ల నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని మాత్రమే హైదరాబాద్‌‌లోని హాస్పిటళ్లకు బదిలీ చేశారు.

 దీంతో నగరంలోని 7 ప్రధాన హాస్పిటళ్లలో కలిపి 30 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల వల్ల వైద్యసేవలకు అంతరాయం కలిగిందని ఇక్కడి నుంచి బదిలీ అయిన డాక్టర్లు, జిల్లాల్లో నుంచి ఇక్కడి రావాలని ఆశిస్తున్న డాక్టర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. ప్రమోషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే, ఇక్కడ రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరో 407 పోస్టులను కాంట్రాక్ట్‌‌  పద్ధతిలో భర్తీ చేసేందుకు సర్కారు ఇదివరకే పర్మిషన్  ఇచ్చింది. ఇందులో ఉస్మానియాలో 115, గాంధీలో 115 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను వారం రోజుల్లో రిక్రూట్‌‌  చేయనున్నారు.