మహిళలూ జాగ్రత్త: ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పేరుతో హైదరాబాద్ సిటీలో మోసాలు

మహిళలూ జాగ్రత్త: ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పేరుతో హైదరాబాద్ సిటీలో మోసాలు

రెండు తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సరఫరా చేసే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బిజిఎల్) తమ కస్టమర్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నేరగాళ్లు తమ కంపెనీ లోగో ఉపయోగించి  ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని.. వినియోగదారులను హెచ్చరిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. వాట్సాప్ ద్వారా నకిలీ APK ఫైల్‌ను ఇన్ స్టాల్ చేయించి.. కస్టమర్ల సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి యత్నిస్తున్నారని కంపెనీ తెలిపింది.

మోసగాళ్ల మాటలు విని ఒక వినియోగదారుడు ఇప్పటికే డబ్బు చెల్లించాడని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పేర్కొంది. "కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని, అనధికారిక యాప్ (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండమని కోరుతున్నాం.." అని BGL ప్రకటన చేసింది.

ఈ నెంబర్లు ఫేక్..

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న నేరగాళ్లు 9940364176 (వాట్సాప్), 9390958942 (మొబైల్) నంబర్లను ఉపయోగిస్తున్నారని కంపెనీ తెలిపింది. ఈ నంబర్ల నుండి వచ్చే సందేశాలు లేదా కాల్స్‌కు ప్రజలు స్పందించవద్దని సూచించింది. అలాగే BGL పేరుతో తెలియని నంబర్ల నుండి వచ్చిన సందేశాలు లేదా WhatsApp కమ్యూనికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. OTPలు, పాస్‌వర్డ్‌లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని హెచ్చరించింది. కేవలం www.bglgas.com వెబ్‌సైట్‌లో అందించిన అధికారిక నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలని కోరింది.