సూర్యాపేట, వెలుగు: మాతా శిశు కేంద్ర భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మాతా శిశు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోదాడలో నవజాత శిశువును వదిలేసిన ఘటనపై కలెక్టర్ దిగ్ర్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆడ శిశువులను పుట్టగానే వదిలేయడం బాధాకరమన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉయ్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైతే పిల్లలను వద్దనుకుంటారో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో శిశువును ఉంచాలని సూచించారు.
కోదాడలో నవజాత శిశువును కాపాడిన ఏఎన్ఎం ను కలెక్టర్ అభినందించారు. వచ్చే నెలలోపు మాతా శిశు కేంద్రం పైన నిర్మిస్తున్న భవనాన్ని పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే వారం మరోసారి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాతా శిశు కేంద్రంలో కావాల్సిన పరికరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని నిత్యం హాస్పిటల్ లో రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, సీఎస్ ఆర్ఎమ్‌ఓ జనార్దన్ రెడ్డి, డాక్టర్స్, డీడబ్ల్యూఓ నరసింహారావు, పాల్గొన్నారు.
రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి
జిల్లాలోని భూమి పట్టాపాస్ బుక్ కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ( ఫార్మర్ ఐడి ) నమోదు చేసుకునేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ, రెవెన్యూ, మండల పరిషత్ సహకార సంఘం జిల్లా, మండల ,గ్రామ అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరని, ఫార్మర్ ఐడీతో బీమా, సబ్సిడీలు, రుణాలు ప్రభుత్వ పథకాలు త్వరగా అందుతాయన్నారు.
నేటి నుంచి ఈ నెల 23వరకు మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రోజు వ్యవసాయ శాఖ ఇతర శాఖ అధికారులు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో రైతు రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను చేస్తారని తెలిపారు. గ్రామంలో అందుబాటులో లేని రైతులు, వారు నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాల్లోని ఏదైనా మీ సేవకు వెళ్లి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ను నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
