నల్గొండ అర్బన్, వెలుగు: ఈ నెల 20 నుంచి 23 వరకు నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఖోఖో బాలురు, బాలికల పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన ఛాంబర్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. ఖోఖో, క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నందున ఏర్పాట్లు చేయాలన్నారు.
క్రీడాకారులకు వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం ప్రాంగణంలో పరిశుభ్రత, లైటింగ్, తాత్కాలిక గ్యాలరీలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి విభాగం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, డీఎస్వైఓ అక్బర్ అలీ, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు ఉన్నారు.
