భద్రాచల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

భద్రాచల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసీతారామంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సావాల్లో భాగంగా గురువారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. తర్వాత బేలా మండపంలో ఉత్సవమూర్తులకు విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, స్నపన తిరుమంజనం నిర్వహించారు.

కల్యాణ కార్యక్రమానికి హాజరయ్యే రుత్విక్కులకు ఏఈవో శ్రావణ్‌కుమార్‌ దీక్షా వస్త్రాలను అందజేశారు. అనంతరం సమస్త నదీజలాలను ఆవాహన చేసిన కలశాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా వేదపండితులతో కలిసి రాజవీధి గుండా తాత గుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు.

కల్యాణోత్సవాల అంకురార్పణ కోసం గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణం నుంచి పుట్టమన్నును సేకరించారు. దానిని ఊరేగింపుగా రామాలయంలోని యాగశాలకు తీసుకొచ్చారు. వాస్తుహోమం నిర్వహించిన అనంతరం నవధాన్యాలను పుట్టమన్నులో కలిపి అంకురార్పణ చేయడంతో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు అర్చకులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో నిత్య కల్యాణాలు, దర్బారు, పవళింపు సేవలు రద్దు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు.

కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీసీతారామచంద్రస్వామి కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. తిరువీధి సేవకు రాజవీధి గుండా తాత గుడి సెంటర్‌ వరకు వెళ్లి అక్కడి గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఊరేగింపుగా వచ్చిన స్వామికి భక్తులు మంగళ నీరాజనాలు పలికారు.