హైస్పీడ్ తో బీజాపూర్ హైవే పనులు ..ఏడాదిన్నరలో పూర్తి చేస్తామంటున్న NHAI

హైస్పీడ్ తో బీజాపూర్ హైవే పనులు ..ఏడాదిన్నరలో పూర్తి చేస్తామంటున్న NHAI
  • 46 కిలోమీటర్లు.. నాలుగు బృందాలు 
  • ఇప్పటికే పూర్తి కావొచ్చిన రెండు బైపాస్​రోడ్లు  
  • వన్ సైడ్ మట్టి పోసే పనులు 50 శాతానికి పైగా పూర్తి

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు హై స్పీడ్‌‌‌‌తో కొనసాగుతున్నాయి.  ఎన్జీటీ మర్రిచెట్లపై ఉన్న కేసు ఎత్తివేయడంతో పనులు చేపట్టిన ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ ఏడాదిన్నరలో పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర 4 బృందాలు పనులు చేస్తున్నాయి.

ఇప్పటికే రెండు బైపాస్​రోడ్ల పనులు చివరి దశకు చేరుకోగా, ప్రధాన రోడ్డుపై వన్ సైడ్ మట్టి పోసి లెవెలింగ్ చేసే పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి.  గ్రామాల వద్ద అండర్ పాస్​లు, సర్వీస్ రోడ్లతో పాటు వర్షపు నీళ్లు వెళ్లేందుకు కల్వర్టులు నిర్మించారు.    

రూ.928 కోట్లతో పనులు

ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.928 కోట్లు కాగా.. రోడ్డు నిర్మాణం, అండర్ పాస్​లు, కల్వర్టులకు రూ.786 కోట్లు, మిగతా డబ్బులు భూసేకరణకు ఖర్చుపెడుతున్నారు.  ప్రస్తుతం ఉన్న రోడ్డు కేవలం 30 ఫీట్లు మాత్రమే ఉండగా కొత్త రోడ్డు నాలుగు లేన్లుగా 100 ఫీట్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు.

మధ్యలో సెంట్రల్ డివైడర్, గ్రామాల వద్ద మొత్తం 18 అండర్ పాస్​లు కడుతున్నారు. ఇక్కడ సర్వీస్, క్రాస్ రోడ్ల నిర్మాణంతో పాటు నైట్ టైమ్​లో ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లు కూడా పెడుతున్నారు. వర్షపు నీరు నిలువకుండా 30కిపైగా చిన్న బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణంతో పక్కా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.  

నాలుగు బ్యాచ్​లుగా పనులు

పనుల కోసం10 కిలోమీటర్లకో టీమ్ చొప్పున నాలుగు టీమ్స్ రెండు షిప్టుల్లో పనులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు 2 లేన్స్ పనులు చేపట్టగా.. ఇప్పటికే మట్టి పోసే పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి.

వికారాబాద్ జిల్లా మన్నెగూడ నుంచి చేవెళ్ల మండలం ముడిమ్యాల వరకు అండర్ పాస్​ల వద్ద మినహా మట్టి పోసి లెవెలింగ్ చేసే పనులు పూర్తికావొచ్చాయి.  మొయినాబాద్ మండల పరిధిలో మాత్రం రెండు వారాల కింద మొదలయ్యాయి.  కల్వర్టుల నిర్మాణం దాదాపు పూర్తికాగా గ్రామాల వద్ద మొత్తం అండర్ పాస్​ల నిర్మాణం కొనసాగుతోంది.    
 
 మర్రి చెట్లకు ఇబ్బంది లేకుండా

ముందు అనుకున్న డిజైన్ ప్రకారం రోడ్డు విస్తరణలో 900 మర్రి చెట్లు పోతుండడంతో 2021లో  సేవ్ బనియన్స్ సంస్థకు చెందిన పర్యావరణ వేత్తలు ఎన్జీటీలో కేసు వేసి పనులు ఆపిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కేసు వేసిన పర్యావరణ వేత్తలతో పలు మార్లు చర్చలు జరిపారు.

900 చెట్లలో కేవలం 136 మర్రి చెట్లు మాత్రమే రీలొకేట్ చేస్తామని, మిగితా చెట్లు అలాగే ఉంచుతామని ఒప్పించి 2024 అక్టోబర్ 31న  కేసు విత్‌‌‌‌డ్రా చేయించారు.  అధికారులు చాలావరకు చెట్లు రోడ్డుకు మధ్యలో వచ్చేలా డిజైన్ మార్చారు. అంటే చెట్లకు ఒకవైపు 2 లేన్స్, మరో వైపు 2 లేన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే చెట్టును వేర్లతో సహా తొలగించి పక్కనే నాటుతున్నారు.    

పూర్తికావొచ్చిన బైపాస్ రోడ్లు

ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా మొయినాబాద్, చేవెళ్ల వద్ద బైపాస్‌‌‌‌లు నిర్మిస్తున్నారు. మొయినాబాద్ టౌన్​కు టచ్ కాకుండా భాస్కర్ దవాఖా కనకమామిడి శివారులో తాజ్ హోటల్ వరకు, కేసారం నుంచి మోడల్ కాలనీ మీదుగా ఇబ్రహీం పల్లి వరకు బైపాస్​లు నిర్మిస్తున్నారు. ఇక్కడ మర్రి చెట్ల పంచాయతీ లేకపోవడంతో ఇప్పటికే పూర్తికావొచ్చాయి.

చేవెళ్ల నుంచి షాద్ నగర్ వెళ్లే రోడ్డుపై, మొయినాబాద్ నుంచి సురంగల్ వెళ్లే రోడ్డుపై బ్రిడ్జిలు, మధ్యలో డివైడర్లు మినహా అండర్ పాసులు, బీటీ వర్క్స్ పూర్తికావొచ్చాయి.

335 యాక్సిడెంట్లు..125 మరణాలు  

ప్రస్తుతమున్న రోడ్డు కేవలం 25 ఫీట్లే ఉండడం, ఇందులో 40 ప్రమాదకర మలుపులు, 21 బ్లాక్ స్పాట్లు ఉండడంతో ఎన్నో ప్రమాదాలు జరిగాయి.  2023 నుంచి ఇప్పటి వరకు 335 యాక్సిడెంట్లు చోటు చేసుకోగా, 125 మంది చనిపోయారు.  మరో 340 మందికి గాయాలయ్యాయి. 2025 నవంబర్ 3న మీర్జాపూర్ వద్ద కంకర టిప్పర్, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది చనిపోయారు.  రోడ్డు విస్తరణ పూర్తయితే  ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.