తీర ప్రాంత ప్రజలను వణికిస్తున్న వానలు

తీర ప్రాంత ప్రజలను వణికిస్తున్న వానలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో గోదావరి నీటిమట్టం తగ్గుతోందని సంతోషంలో ఉన్న తీర ప్రాంత ప్రజలను వానలు వణికిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటలకు 60.60 అడుగులకు గోదావరి నీటిమట్టం తగ్గింది. 18,20, 392 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. తీర ప్రాంత మండలాల్లో గడిచిన 24గంటల్లో 687 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పినపాకలో 93.6, అశ్వాపురంలో 55.4, మణుగూరులో 76, గుండాలలో 55.2, బూర్గంపాడులో 30.2, భద్రాచలంలో 33.6 మిల్లీమీటర్ల వాన పడింది.  వాతావరణ శాఖ ఈ నెల 29వ తేదీ వరకు వానలు పడతాయని ప్రకటించడంతో  వరద బాధితులు భయపడుతున్నారు.  

భద్రాచలంలోని సుభాష్ నగర్, అయ్యప్ప, ఏఎంసీ కాలనీలు ఇప్పడిపుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. వాడల్లో దుర్వాసన వస్తోంది. ఇండ్లలో పోసిన ఒండ్రు మట్టిలో పాములు, తేళ్లు, కప్పలు కనిపిస్తున్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు కరెంట్​సరఫరా పునరుద్ధరించలేదు. పోల్స్​ నీటిలోనే మునిగి ఉన్నాయి. గోదావరి 58 అడుగులకు తగ్గితే కానీ బయటపడే అవకాశాలు లేవు. అప్పటి వరకు ఈ మండలాలకు కరెంట్​ వచ్చే చాన్స్​ లేదు. మిషన్​ భగీరథ నీళ్లు రాక పంచాయతీలు, ఇతర ఎన్జీఓలు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నీళ్లను పట్టుకోవడానికి జనం పరుగులు పెడుతున్నారు. 

బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి

భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలను నిషేధించిన కలెక్టర్​ ఆదివారం సాయంత్రం నుంచి సడలించారు. కేవలం లైట్​వెహికల్స్ కు మాత్రమే అనుమతిచ్చారు. లారీలు, బస్సులను రానివ్వడం లేదు. 144 సెక్షన్​ కూడా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో ఎత్తేశారు. గోదావరి కరకట్ట పైకి ఎవరినీ రానివ్వడం లేదు. 

ఇండ్లను శుభ్రం చేసుకునేందుకు తిప్పలు

భద్రాద్రికొత్తగూడెం : వరద తగ్గడంలో బూర్గంపాడు, భద్రాచలంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఇండ్లకు చేరుకుంటున్నారు. ఇండ్లతో పాటు ఆవరణలో చేరిన ఒండ్రు మట్టితో పాటు కొట్టుకువచ్చిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. కరెంట్​ లేక బోర్లు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. బూర్గంపాడులోని ఇండ్లలో చేరిన ఒండ్రు మట్టి, చెత్తను తొలగించడం కోసం ఫైరింజన్లు తెప్పించాలని బాధితులు కోరుతున్నారు. అశ్వాపురం మండలం చింతిర్యాలలోని పునరావాస కేంద్రంతో పాటు మెట్టుగూడెంలోని సెంటర్ ​బురదమయమైంది. గవర్నర్​, సీఎం పర్యటనతో ఆదివారం హడావుడిగా బ్లీచింగ్​ పౌడర్​ చల్లి వదిలేశారు. అశ్వాపురం, మెట్టుగూడెం, లక్ష్మీపురం ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాల్లో సరిపోను టాయ్​లెట్లు లేక మహిళలు ఇబ్బందులు పడ్డారు.