రేగా కాంతారావును మాట్లాడనియ్య...మైకు లాక్కున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

రేగా కాంతారావును మాట్లాడనియ్య...మైకు లాక్కున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం  రసాబాసగా మారింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య వివాదం చెలరేగింది. రేగా కాంతారావు మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పోదెం వీరయ్య మైక్ లాక్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదికపై రేగా కాంతారావును ఎమ్మెల్యే వీరయ్య అడ్డుకున్నారు.  ఎట్టి పరిస్థితుల్లో రేగా కాంతారావుని మాట్లాడనివ్వనని ఎమ్మెల్యే వీరయ్య పంతం పట్టారు. రేగా  కాంతారావు చేతిలో మైక్ ను లాక్కున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రేగా కాంతారావు మాట్లాడాలి అంటూ నినాదాలు  చేశారు. దీంతో వేదికపైనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు.

వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం పథకంలో లబ్దిదారులను తనకు తెలియకుండా ఎలా ఎంపిక చేశారని.. బీసీ సంక్షేమశాఖ అధికారిని ఎమ్మెల్యే పోదెం వీరయ్య ప్రశ్నించారు.  మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేశారని..తనను మాత్రం ఎందుకు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.