భద్రాద్రికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

భద్రాద్రికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక మాసం కారణంగా ఆదివారం భక్తులతో రామాలయంలోని క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. దర్శనానికి కనీసం గంట సమయం పట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేసింది. గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి రామయ్యకు గర్భగుడిలో సుప్రభాత సేవను చేశారు. బాలబోగం నివేదించారు. పంచామృతాలతో మూలవరులకు అభిషేకం, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. 

భక్తులకు స్వామి వారి అభిషేక జలాలతో పాటు మంజీరాలు పంపిణీ చేశారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చనను నిర్వహించారు. రామదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపారు. ఈ కల్యాణంలో 87 జంటలు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పం నివేదన వరుస క్రమంలో జరిగాయి. 

చిత్రకూట మండపంలో కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. తొమ్మిది జంటలు ఈ వ్రతాల్లో పాల్గొన్నాయి. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత సాయంత్రం దర్బారు జరిగింది. సీతారామయ్యకు కాగడా హారతిని సమర్పించారు. పాపికొండల విహారయాత్ర ముగించుకుని సాయంత్రం వేళ వచ్చిన పర్యాటకులు సైతం రామదర్శనం చేసుకున్నారు. దీనితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది.