
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం, బంగారు పుష్పాలతో అర్చన చేశారు. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు ఆవు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం, పసుపు ముద్దలు అద్ది స్నపన తిరుమంజనం చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు మంజీరాలను పంపిణీ చేశారు. అభిషేకం తర్వాత మూలవరులను అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.