పుష్కరాల నాటికి భద్రాద్రికి నవశోభ! : సీఎం రేవంత్ రెడ్డి

పుష్కరాల నాటికి భద్రాద్రికి నవశోభ! : సీఎం రేవంత్ రెడ్డి
  •     మూడు దశల్లో మాస్టర్ ప్లాన్.. 2027 మార్చి నాటికి తొలి విడత పూర్తి లక్ష్యం

హైదరాబాద్, వెలుగు :  భద్రాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా మూడు దశల్లో సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తొలి దశ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. శనివారం జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి  సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. పుష్కరాల్లో భక్తుల రద్దీని తట్టుకునేలా గోదావరి తీరంలో ఘాట్ల నిర్మాణం, ఉన్న ఘాట్ల ఆధునీకరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2027 మార్చి 31 నాటికి తొలి విడత పనులను పూర్తి  చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని సీఎం గడువు విధించారు. పుష్కరాల అనంతరం మిగిలిన అభివృద్ధి పనులను కొనసాగించేలా ముందుగానే సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.