రుణాలు మంజూరులో బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ అసహనం

రుణాలు మంజూరులో బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ అసహనం
  • రూ 3,899.28 కోట్లకు ఇచ్చిన రుణాలు రూ.2,138.26 కోట్లే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతులతోపాటు వివిధ వర్గాలకు రుణాలు మంజూరులో బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ అసహనం వ్యక్తం చేశారు.  శనివారం కలెక్టరేట్​లో డీసీసీ, డీఎల్​ఆర్​ సమీక్ష  బ్యాంకర్లు, జిల్లా శాఖాధికారులతో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–-సెప్టెంబర్​ మధ్య వివిధ రంగాల్లో రుణాల విడుదల వివరాలు వెల్లడించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 3,899.28 కోట్ల లక్ష్యానికి గాను 2,138.26 కోట్లు, ఎంఎస్ఎంఈ  రంగంలో రూ. 847.80 కోట్ల లక్ష్యానికి గాను రూ. 439.84 కోట్లు, విద్యా రుణాల్లో రూ.6.96 కోట్లు, హౌసింగ్ లోన్లలో రూ. 10.84 కోట్లు, ఇతర రంగాల్లో రూ.35.09 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

 మొత్తం లక్ష్యాల్లో 53.33 శాతం సాధించినట్లు తెలిపారు. రైతుల రుణ రెన్యూవల్​పై అవగాహన కల్పించి, వ్యవసాయ శాఖతో కలిసి బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్నచిన్న కారణాలతో రైతుల రుణ దరఖాస్తులను తిరస్కరించడం పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం రుణాల మంజూరు కీలకమని, అనవసర ఆటంకాలు కలిగిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

చేపలపెంపకంపై స్పెషల్​ ఫోకస్​

ప్రత్యేకంగా చేపల పెంపకం యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలన్నారు. ఒక్క చేపల పెంపకం యూనిట్ స్థాపనకు సుమారు రూ.4.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు.  ఆధునిక బయోఫ్లాక్ టెక్నాలజీ, పొండ్-బేస్డ్ మోడళ్లతో ఈ యూనిట్లు సంవత్సరం పొడవునా ఆదాయం  అందిస్తాయన్నారు. కౌజు పిట్టల పెంపకం ద్వారా నెలకు రూ. 10 వేల ఆదాయం వస్తుందని, కూరగాయల సాగు లాంటి యూనిట్లతో కలిపి చేపల పెంపకం చేస్తే రైతుల నెలవారీ ఆదాయం  మరింత పెరుగుతుందని చెప్పారు. 

జిల్లాలో మునగ సాగు విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు.  ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, రిజర్వ్ బ్యాంక్ అధికారి గౌతమి, ఎల్ డి ఎం రామిరెడ్డి, మెప్మా పీడీ రాజేశ్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, అన్ని బ్యాంక్ ల అధికారులు  పాల్గొన్నారు.