స్కూల్ అభివృద్ధిలో హెడ్మాస్టర్ది కీలక పాత్ర : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

స్కూల్ అభివృద్ధిలో హెడ్మాస్టర్ది కీలక పాత్ర : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

సుజాతనగర్,వెలుగు : స్కూల్​ అభివృద్ధికి హెడ్మాస్టర్​ది కీలక పాత్ర ఉంటుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ తెలిపారు. మంగళవారం సుజాతనగర్ జడ్పీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల నిర్వహణ, శుభ్రత, విద్యార్థుల హాజరు, సౌకర్యాలపై  సమీక్షించారు. స్వచ్ఛత కాంపైన్ 5.0  కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన శుభ్రతా చర్యల గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. రోజూ చేయాల్సిన పనులు సరిగా జరగకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ విద్యా కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో టీచర్లు సమన్వయంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో, తల్లిదండ్రుల సహకారంతో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. 

పాఠశాల అభివృద్ధి అనేది కేవలం భవన నిర్మాణం. వసతుల పెంపు కాదని, అది ఒక సమగ్ర ప్రక్రియ. అందులో ప్రధానోపాధ్యాయుడు కీలక నాయకత్వ పాత్ర పోషించాలని సూచించారు. టాయిలెట్లకు తాళం వేసి ఉండటంతో అగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో  కోసం మరో కొత్త బోర్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాల  కావడంతో ఆటస్థల అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి, విద్యార్థుల క్రీడా ప్రతిభను పెంపొందించే దిశగా క్రీడా ప్రాంగణంలు  ఏర్పాటు చేయాలని సూచించారు. భవిత కేంద్రాలు పాఠశాలలకు విలువైన వనరుల కేంద్రాలుగా మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, వాటి నిర్మాణం నాణ్యతతో ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్  ఎన్. సతీశ్​ కుమార్, హెచ్​ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.