ముక్కోటి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ జితేశ్

ముక్కోటి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ జితేశ్
  •     భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​

భద్రాచలం, వెలుగు : ఈనెల 29,30 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వారదర్శనం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఆదేశించారు. ముక్కోటి ఏర్పాట్లపై సోమవారం సబ్​ కలెక్టర్​ ఆఫీసులో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. పోలీసు,రెవెన్యూ, ఎండోమెంట్​శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

మహోత్సవ పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లలో లోపాలు రాకూడదన్నారు. లాడ్జీ, హోటల్ యజమానులతో వెంటనే మీటింగ్​ ఏర్పాటు చేసి ధరలు నిర్ణయించాలన్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ టీవీల ఏర్పాటు ప్రారంభించాలన్నారు. భద్రాచలం,పర్ణశాల దేవాలయాల్లో లైటింగ్​ పెట్టాలని సూచించారు. ఉత్సవాల వీక్షణకు అనువుగా ఎల్​ఈడీలు పెట్టాలన్నారు. హంసావాహనం తనిఖీ చేసి ధ్రువీకరణ నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్​ ఇంజినీర్లను ఆదేశించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా, హంసావాహనంపైకి పరిమిత సంఖ్యలో అనుమతించాలని సూచించారు. 

శానిటేషన్​ నిర్వహణ చక్కగా ఉండాలన్నారు. ఏరు ఫెస్టివల్​తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గోదావరి తీరంలో ఏరు ఫెస్టివల్​కు సంబంధించిన పాకల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలన్నారు. ట్రైబల్​ మ్యూజియం, బొజ్జిగుప్ప పర్యాటక ప్రాంతం , గోదావరిలో పుట్టి ప్రయాణం కోసం స్విమ్మర్లకు ట్రైనింగ్​ ఇవ్వాలన్నారు. సబ్​ కలెక్టర్​ మృణాల్​ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​, ఏఈవో శ్రావణ్​కుమార్​, ఈఈ రవీంద్రనాథ్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.