చేపల వేటతో ఒక్కరి నుంచి గ్రామం అంతా సోకిన కరోనా!

చేపల వేటతో ఒక్కరి నుంచి గ్రామం అంతా సోకిన కరోనా!


అశ్వారావుపేట, వెలుగు: పదిహేను రోజుల క్రితం వరకు ఆ ఊరిలో ఒక్క కరోనా కేసు లేదు. చుట్టూ గుట్టలు, పచ్చని చెట్లతో అంతా ప్రశాంతంగా ఉండేది. ఇటీవల గ్రామస్తులు చేపల వేటకు వెళ్లొచ్చాక కొవిడ్​స్ప్రెడ్​అయ్యింది. 50 మందికి పైగా వైరస్​ బారిన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన పంచాయతీ మొద్దులమడ. ఈ గ్రామంలో 270 మంది ఉన్నారు. ఇటీవల బయటి నుంచి గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు తేలింది. అతని నుంచి ముగ్గురికి స్ప్రెడ్​అయ్యింది. కాగా అదే టైంలో ఊరికి ఆనుకుని ఉన్న చెరువులో గ్రామస్తులు చేపల వేటకు వెళ్లారు.అది వారి పాలిట శాపంగా మారింది. వేటకు వెళ్లొచ్చిన వారు ఒకరి తర్వాత మరొకరు వైరస్​బారిన పడుతూ వచ్చారు. ఇప్పటి వరకు 50 మందికి పైనే కరోనా సోకింది. పాజిటివ్ ​వచ్చిన 23 మంది ఇరుకు ఇండ్లలో ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతుందనే  భయంతో స్థానిక వైకుంఠధామంలో ఉంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న కొత్తగూడెం అసిస్టెంట్​డీఎంహెచ్ఓ శ్రీనివాసరావు గురువారం గ్రామాన్ని పరిశీలించారు. శ్మశానంలో ఉంటున్న 19 మందిని మండల పరిధిలోని సున్నం బట్టి ఆశ్రమానికి తరలించారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటారని, భయపడొద్దని ధైర్యం చెప్పారు. నలుగురు పేషెంట్లు మాత్రం తాము ఇండ్లలోనే ఉంటామని చెప్పారు. కాగా గురువారం గ్రామంలో కరోనా టెస్టులు చేయించుకున్న ఐదుగురికి పాజిటివ్​ అని తేలింది.