కబ్జా భూములను గిరిజనులకు పంచాలి : ఆదివాసీ సంఘాల జేఏసీ

కబ్జా భూములను గిరిజనులకు పంచాలి : ఆదివాసీ సంఘాల జేఏసీ
  • ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్ రామకృష్ణ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని, గిరిజనులకు పంచాలని ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ డిమాండ్​చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ముల్కలపల్లి మండలం పూసుగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 241లో దాదాపు 63 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీర్ అనే కేటీపీఎస్ ఉద్యోగి కబ్జా చేసి 30 ఏండ్లుగా వాడుకుంటున్నాడని ఆరోపించారు. కోళ్ల ఫారంతోపాటు రియల్ ఎస్టేట్​ చేస్తున్నాడని చెప్పారు. సదరు భూమిని స్వాధీనం చేసుకుని ఆదివాసీలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.