- జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని పిలుపు
- రూ.362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రజలు తనకెప్పుడూ అండగా ఉన్నారని, జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 20 ఏండ్లుగా జిల్లాతో తనకు రాజకీయ అనుబంధం ఉందని చెప్పారు. భద్రాచలం రాముడిని గత ముఖ్యమంత్రి మోసం చేశారని, భద్రాచలం ఆలయాన్ని అయోధ్య ఆలయంలా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి భద్రాచలంలో శ్రీరామ చంద్రమూర్తి సాక్షిగా ప్రారంభించామన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏదులాపురం వద్ద రూ.108.60 కోట్లతో నిర్మించనున్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల భవనాలకు భూమిపూజ చేయడంతో పాటు, కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రి, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను, మద్దులపల్లిలోని నూతన మార్కెట్ యార్డును సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులతో ముచ్చటిస్తూ జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో నర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి విదేశీ భాషలు, సంస్కృతి నేర్పించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం సీఎం సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తూ పాలన సాగిస్తే, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మంత్రులందరి సమన్వయంతో, అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే జిల్లాలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఏప్రిల్ తర్వాత పట్టణ ప్రాంతాల్లో రెండో విడత ఇండ్లను అందిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ పాలనలో అన్ని పాత్రలను ఒక్క ముఖ్యమంత్రి పోషిస్తూ ఏకపాత్రాభినయం చేశారన్నారు. ప్రస్తుత కేబినెట్ లో అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ అంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని అప్పటి ముఖ్యమంత్రి అంటే, ఇప్పుడు సన్నవడ్లు వేయండి బోనస్ ఇస్తామని మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కస్థానమే ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
‘సీతారామ’తో 6.80 లక్షల ఎకరాలకు సాగునీరు
సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలోని 6.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు వేగవంతం చేశామని, మున్నేరు-పాలేరు లింక్ కాల్వ ద్వారా ఏటా రూ.120 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని వివరించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పంచాయతీ ఎన్నికలలో ఆమోదం తెలిపేలా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించాలనేదే తన లక్ష్యమని చెప్పారు.
భవిష్యత్తులో కృష్ణా జలాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ నాగార్జున సాగర్ 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం గోదావరి జలాలను వినియోగిస్తామన్నారు. రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుందని, కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఒంటి నిండా విషమే ఉందన్నారు. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజా ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69 శాతం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోవడం తమ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం అని, ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగాలని చెప్పారు. ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్ బాబు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు.
పరిశ్రమల పార్కు మంజూరు చేయాలి
సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా అవసరమైన పరిశ్రమలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొని రావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు పరిశ్రమల పార్కు ప్రత్యేకంగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం కలిసి జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, ఆరోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
