భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా తూము లక్ష్మీనర్సింహదాసు జయంతి

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా తూము లక్ష్మీనర్సింహదాసు జయంతి
  • వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం వాగ్గేయకారుడు రాజా శ్రీతూము లక్ష్మీనర్సింహదాసు 235వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఫొటోతో ముందుగా ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు, భక్తులు భద్రగిరి ప్రదక్షిణ చేశారు. మూడు ప్రదక్షిణలు చేశాక, ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ తూము లక్ష్మీనర్సింహదాసు పేరిట రాముని సన్నిధిలో కేశవనామార్చన చేశారు. 

అర్చన అనంతరం స్వామివారి శేషవస్త్రాలు, శేషమాలికలు, ప్రసాదం అందజేశారు. వేదాశీర్వచనం ఇచ్చారు. గిరిప్రదక్షిణ సమయంలో విస్తా కాంప్లెక్స్ వద్ద తూము లక్ష్మీనర్సింహదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం రామాయణపారాయణదారుడు ఎస్టీజీ కృష్ణమాచార్యులు రచించిన సచిత్ర శ్రీరాజా తూము లక్ష్మీనర్సింహదాసు గ్రంథావిష్కరణను ఈవో దామోదర్​రావు చేశారు. అంతకుముందు ఉదయం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. స్నపన తిరుమంజనం చేశాక భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం నిర్వహించారు. 

తూము లక్ష్మీనర్సింహదాసు జయంతి సందర్భంగా భజన కార్యక్రమం జరిగింది. చిన్నజీయర్​స్వామిమఠంలో తదియారాధన, వేదాశీర్వచనం జరిగాయి. సాయంత్రం చిత్రకూట మండపంలో స్థానాచార్యులు స్థలసాయి తూము నర్సింహదాసు సంకీర్తనసేవ కార్యక్రమం వీనులవిందుగా సాగింది. సాయంత్రం దర్బారు సేవ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీనియర్​ ఐపీఎస్​ ఆఫీసర్​ సీవీ ఆనంద్​ సతీసమేతంగా స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.