ఉరి వేసుకున్నట్లు నటించబోతే.. ఉరి బిగుసుకుని చనిపోయాడు

V6 Velugu Posted on Jul 31, 2021

  • చిన్నారుల నాటక ప్రదర్శన రిహార్స్ ల్ లో అపశృతి
  • ఉత్తర్ ప్రదేశ్ లోని బుడౌన్ జిల్లాలో ఘటన
  • తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి..

లక్నో: స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి ప్రదర్శించాల్సిన నాటకాన్ని సాధన చేస్తూ 10 ఏళ్ల బాలుడు మరణించాడు. ఆగస్టు 15న భగత్ సింగ్ నాటకాన్ని వేసేందుకు సిద్ధమైన విద్యార్థులు రిహార్సల్స్ చేస్తున్నారు. భగత్ సింగ్ ను ఉరేసిన సీన్ కోసం ఇంటి పైకప్పుకు కట్టిన ఉరితాడును భగత్ సింగ్ లా నటించబోతున్న బాలుడు స్టూలు పైకి ఎక్కి ఉరితాడును మెడకు బిగించుకున్నాడు. ప్రాక్టీస్ లో భాగమని స్టూల్ ను తన్నగా.. ఉరితాడు నిజంగానే గొంతుకు బిగుసుకుపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బుడౌన్ జిల్లాలో జరిగింది. ప్రమాదవశాత్తు తమ కుమారుడు మరణించిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ టీచర్లు.. ఇతర విద్యార్థుల ద్వారా విషయం బయటకు పొక్కడంతో జాతీయ మీడియా సైతం స్పందించింది. దీంతో జిల్లా పోలీసులు స్వచ్ఛందంగా విచారణ జరపగా ఘటన జరిగింది నిజమేనని తేలింది.
బాబాత్ గ్రామానికి చెందిన పిల్లలు ఈనెల 29న గురువారం నాడు ఆగష్టు 15 న పాఠశాలలో ప్రదర్శించే భగత్ సింగ్ జీవిత కథ నాటకం రిహార్సల్ చేస్తున్నారు. భూరేసింగ్ కొడుకు శివమ్ తన మిత్రులతో కలసి ఉరితీసే సన్నివేశం కోసం ఉరితాడును రెడీ చేయించుకున్నారు. ఇంటి పై కప్పు నుంచి వేలాడదీసిన ఉరితాడు ఎలా ఉందో చెక్ చేసేందుకు శివమ్ స్టూలుపై ఎక్కి మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. రిహార్స్ లో భాగంగా స్టూల్ ను తన్నగా.. ఉరితాడు నిజంగానే మెడకు బిగుసుకుపోయింది. కాళ్లు టపటపా కొడుతూ.. ఊగిపోతున్న శివమ్ ను చూసి సహచర విద్యార్థులు భయంతో కేకలు వేశారు. ఇరుగుపొరుగున ఉన్న వారు వచ్చి చూడగా బాలుడు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్టూలుపైకి కాళ్లు పెట్టి మెడకు బిగుసుకున్న తాడును విప్పి చూడగా.. అప్పటికే ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది. దీంతో బాలుడు మరణించినట్లు గుర్తించారు. 
తమ కొడుకు శివమ్ భగత్ సింగ్ లా నాటక ప్రదర్శన కోసం ఉరేసుకునే సీన్ రిహార్సల్ చేస్తూ చనిపోయాడన్న విషయం తెలుసుకుని తల్లిదండ్రులు భోరున విలపించారు. తండ్రి  భూరేసింగ్ ఆధ్వర్యంలో బంధుమిత్రులు కలసి బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరుసటి దినం..అంటే నిన్న శుక్రవారం నాడు స్కూల్ టీచర్లు, ఇరుగు పొరుగు ద్వారా విషయం బయటకు పొక్కడం కలకలం రేపింది. దీంతో జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించి విచారణ చేయించారు. ఘటన జరిగింది వాస్తవమేనని.. పూర్తి స్థాయిలో నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 

Tagged , Uttar Pradesh today, Lucknow today, school boy died while rehearsing, Budaun district, Babath village, Bhure Singh father of boy

Latest Videos

Subscribe Now

More News