భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం

భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం

ఆసిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్/మంచిర్యాల/నస్పూర్, వెలుగు: దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకలను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు. ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో కలెక్టర్ రాజర్షి షా, అధికారులు భాగ్యరెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లా మాల సంక్షేమ సంఘ భవనంలో నాయకులు జయంతి వేడుకలు నిర్వహించి నివాళులు అర్పించారు.

మహనీయుల చరిత్ర, వారి త్యాగాలను భావితరాలకు అందించాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్​లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, కుల సంఘాల నాయకులతో కలిసి హాజరై భాగ్యరెడ్డి ఫొటోకు నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన దీన జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ అని అన్నారు. అధికారులు పాల్గొన్నారు.

దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు 

దళితుల అభ్యున్నతికి, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖ ఉప సంచాలకులు రవీందర్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గాప్రసాద్, అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై భాగ్యరెడ్డి వర్మ ఫొటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

బాల్య వివాహాలు, అంటరానితనం, దేవదాసి, జోగిని వ్యవస్థలను రూపుమాపేందుకు పోరాటం చేశారని కలెక్టర్​ పేర్కొన్నారు. భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీస్ కమీషనర్ ఆఫీసులో ఆయన ఫొటోకు నివాళులర్పించారు. అడిషనల్ డీసీపీ రాజు, ఏసీపీలు రాఘవేంద్ర రావు, ప్రతాప్, సీఐ పురుషోత్తం, పోలీసు అధికారులు పాల్గొన్నారు.