‘అరుంధతి’ లాంటి పవర్‌ఫుల్ రోల్ చేయాలనే కోరిక ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన భాగ్యశ్రీ బోర్సే.. ఆ కోరికను అతి తక్కువ టైమ్‌లోనే నెరవేర్చుకుంటోంది. రీసెంట్‌గా రామ్‌తో ‘ఆంధ్రకింగ్ తాలుకా’ చిత్రంతో మెప్పించిన ఆమె తాజాగా ఓ లక్కీ చాన్స్ అందుకుందని తెలుస్తోంది. వేణు ఊడుగుల, స్వప్న దత్‌ల నిర్మాణంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందట. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో రమేష్ ఎలిగేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ముందుగా ఈ కథకు శ్రీలీల పేరు వినిపించగా, చివరిగా భాగ్యశ్రీని ఫైనల్ చేశారట.
ఈ చిత్రానికి రాజేంద్ర ప్రసాద్ ఎవర్‌గ్రీన్ ‘ఏప్రిల్ 1 విడుదల’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ లోని లిరిక్స్ ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న ‘లెనిన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీతో కూడిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
