రసాభాసగా భైంసా మున్సిపల్ సమావేశం.. రూ.21.10 కోట్లతో బడ్జెట్ 

 రసాభాసగా భైంసా మున్సిపల్ సమావేశం.. రూ.21.10 కోట్లతో బడ్జెట్ 

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మంగళవారం మున్సిపల్ చైర్​పర్సన్ తూమోల్ల దత్తాత్రి అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. బడ్జెట్ ఎజెండాలోని అంశాలపై ఎంఐఎం కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.21.10 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కొద్దిపాటి అభ్యంతరాలు, చర్చతో కౌన్సిల్ అమోద ముద్ర వేసింది. బడ్జెట్ సమావేశానికి ముందు ఎంఐఎంకు చెందిన 20వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ జాబీర్ ఆహ్మద్ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభం కాగా.. ఎజెండాలోని 9 అంశాలపై ఎంఐఎం కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలిపారు. చైర్​పర్సన్ తూమోల్ల దత్తాత్రి వాటిని తోసిపుచ్చారు. పాలక వర్గ, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఎజెండాలోని అంశాలతో పాటు వివిధ అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. అరగంటకుపైగా ఎజెండాలోని అంశాలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.