
- సమ్మెలో పాల్గొననున్న 25 కోట్ల మందికి పైగా కార్మికులు
- బ్యాంకింగ్, పోస్టల్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ప్రభుత్వ ఆఫీసుల్లో సేవలకు అంతరాయం
- స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు పాల్గొంటున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 25 కోట్ల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. దీనివల్ల బ్యాంకింగ్, ఇన్సురెన్స్, పోస్టల్, కోల్ మైనింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, స్టేట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ప్రభుత్వ ఆఫీసులు, పీఎస్‌యూలలో సేవలకు అంతరాయం కలగనుంది.
స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ ఆఫీసులు యథావిధిగా నడుస్తాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతిపాదిత నాలుగు లేబర్ కోడ్స్‌ను నిలిపివేయాలని, కార్మికులు సంఘాలు పెట్టుకునే, సమ్మె చేసుకునే హక్కును పునరుద్ధరించాలని, ఉద్యోగ ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని, కొత్త ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకం కూలీలకు ఇచ్చే వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
సమ్మెలో పాల్గొంటున్న సంఘాలివే..
10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాల జాయింట్ ఫోరమ్ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్‌టీయూసీ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ), హింద్ మజ్దూర్ సభ(హెచ్ఎంఎస్), సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ వుమెన్స్ అసోసియేషన్, లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్(ఎల్‌పీఎఫ్), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(యూటీయూసీ) పాల్గొంటుండగా.. రైతు సంఘాలు, రూరల్ వర్కర్స్ యూనియన్స్, రైల్వే, ఎన్‌ఎండీసీ, స్టీల్ ఇండస్ట్రీస్ వర్కర్ల యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి.