- తెలుగు, ఇంగ్లిష్,ఉర్దూ భాషల్లో తయారీ
- కవర్ పేజీలో భారత్ ఫ్యూచర్ సిటీ ఫొటో
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ మూడు భాషల్లో సిద్ధమవుతోంది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ డాక్యుమెంట్ ను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలను త్వరలో ప్రభుత్వ వెబ్‌సైట్లలో అప్ లోడ్ చేయనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా విజన్ రిపోర్టులను హెచ్ఓడీలు పంపగా.. సీఎస్ నేతృత్వంలో అధికారుల బృందం వాటికి తుదిరూపు దిద్దుతున్నది.
శనివారం సాయంత్రంలోపు ఫైనల్ చేయనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమిట్లో విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. సుమారు వెయ్యి మంది ప్రతినిధులకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
వివిధ రంగాల, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.దీని కవర్ పేజీలో భారత్ ఫ్యూచర్ సిటీ ఫొటో పెడుతున్నారు.
