- రవాణా చార్జీలతో పాటు ఇతర ఖర్చులు భరించేందుకు ముందుకొస్తున్న అభ్యర్థులు
- ముందుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఓటర్ల అకౌంట్ల సేకరణ
- సొంతంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్న మరికొందరు లీడర్లు
మహబూబ్‌నగర్/నల్గొండ, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లు వలస ఓటర్లపై ఫోకస్ చేశారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్, ముంబై, పూణేతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలను రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా వలస ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తూ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. పోలింగ్ రోజు నాటికి స్వగ్రామాలకు వచ్చేందుకు రవాణా చార్జీలు చెల్లించడంతో పాటు ‘ఇతర ఖర్చులు’ సైతం భరించేందుకు ముందుకు వస్తున్నారు. మరికొందరు క్యాండిడేట్లు ప్రత్యేకంగా వాహనాలను సమకూరుస్తున్నారు.
రూ. 600 నుంచి రూ. 10 వేల వరకు
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో మొదటి విడతలో తొమ్మిది మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా.. ఏడు మండలాల్లో వలస ఓటర్లే ప్రభావం చూపనున్నారు. రెండు జిల్లాల పరిధిలో గండీఢ్, మహమ్మదాబాద్, కోస్గి, గుండుమాల్, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ఓటర్లు కొందరు జంటగా.. మరికొందరు కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో ఎస్టీలు, బీసీలే ఎక్కువగా ఉన్నారు.
దీంతో వారిని గ్రామాలకు రప్పించేందుకు క్యాండిడేట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఓటర్లకు ఒక వ్యక్తికి రూ.600 చొప్పున అప్‌అండ్‌డౌన్ చార్జీలు చెల్లిస్తామని, పోలింగ్ రోజున దావత్ సైతం ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అదే ఇద్దరు ఓటర్లు అయితే రూ. 1200, ఫ్యామిలీకి అయితే రూ. 5 వేల వరకూ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇక ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో ఉంటున్న ఒక్కొక్కరికి రవాణా చార్జీల కింద రూ.1,200, జంటకు రూ. 3 వేలు, కుటుంబానికి అయితే రూ.9 వేల నుంచి రూ. 10 వేల వరకు ఇస్తామని చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో డబ్బులను ముందస్తుగానే చెల్లించేందుకు ఓటర్ల ఫోన్ పే, గూగుల్ పే నంబర్లను సేకరిస్తున్నారు. ఆన్‌లైన్ లేని వారు.. ఇతర వ్యక్తుల అకౌంట్లలోకి డబ్బులు వేయించుకుంటున్నారు. మరికొందరు క్యాండిడేట్లు.. ఓటర్లను తీసుకొచ్చేందుకు తామే సొంతంగా డీసీఎంలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. స్వగ్రామానికి వచ్చిన ఓటర్లకు పోలింగ్ ముగిసిన రోజు రాత్రి పెద్ద ఎత్తున దావత్ ఇచ్చేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.
ఒక్కో గ్రామంలో రెండు వందలకు పైనే...
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధానంగా కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, నకిరేకల్, భువనగిరి, మునుగోడు, ఆలేరు, దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాంతాల నుంచి ఓటర్లు వలస వెళ్లారు. ఇలా వలస వెళ్లిన ఓటర్లు ఒక్కో గ్రామంలో రెండు వందలకుపైగానే ఉన్నారని తెలుస్తోంది. పంచాయతీల్లో ఎన్నికల్లో ఈ ఓట్లే గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉండడంతో వీరిని ఆకట్టుకునేందుకు క్యాండిడేట్లు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు.
ఒక్కో ఫ్యామిలీలో మూడు, నాలుగు ఓట్లు ఉండడంతో ఒక్కో ఓటుకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఇస్తామని, రవాణా ఖర్చులు సైతం తామే భరిస్తామని హామీ ఇస్తున్నారు. అవసరమైతే ముందస్తుగానే పేమెంట్లు చేస్తున్నారు. గ్రామాల్లో ఉంటున్న వలస ఓటర్ల బంధువులతో ఫోన్లు చేయించి పోలింగ్ నాటికి గ్రామాలకు చేరుకోవాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లపై కూడా క్యాండిడేట్లు ఫోకస్ చేశారు. ఈ ఓటర్లకు ఓటుకు రూ. 3 వేలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
