అట్టహాసంగా భారత మాత మహా హారతి భూమి పూజ

అట్టహాసంగా భారత మాత మహా హారతి భూమి పూజ

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు పీపుల్స్​ప్లాజాలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత మహా హారతి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు పాల్గొన్నారు. 

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. ఈ నెల 22న నెక్లెస్ రోడ్డు పీపుల్స్​ప్లాజా వద్ద సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ పాల్గొంటారని తెలిపారు. దాదాపు 3 వేల మందికిపైగా అమ్మాయిలు భారత మాత వేషధారణలో పాల్గొంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తున్నారని అన్నారు. ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని తిలకించాలని పిలుపునిచ్చారు. 

‘భారత మాత మహా హారతి’లో పాల్గొనండి : చింతల 

గత 6 సంవత్సరాలుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తెలిపారు. శనివారం (ఈనెల 21న) సాయంత్రం ఎన్టీఆర్ గార్డెన్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు భారత మాత విగ్రహాన్ని ర్యాలీగా తీసుకువచ్చి ప్రతిష్టిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భారత మాత మహా హారతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.