గంజాయి కేసులో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు

గంజాయి కేసులో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు
  • పురానాపూల్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు గంజాయి కస్టమర్ల అరెస్ట్
  • మా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, కామన్ ఫ్రెండ్స్ వద్ద నంబర్ దొరికింది
  • మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మాజీ ఐఏఎస్, మాజీ ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి కుమారుడు భరత్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ గంజాయి కేసులో చిక్కుకున్నాడు. స్నేహితులతో కలిసి గంజాయి, హాష్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు తేలడంతో హైదరాబాద్​లోని మంగళహాట్​ పోలీసులు బుధవారం ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్సీ స్పందిస్తూ..  గంజాయి తాగే ఫ్రెండ్ ​ ఫోన్‌‌‌‌‌‌‌‌లో తన కుమారుడి నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరికిందనే కారణంతో పోలీసులు తమ ఇంటికి వచ్చి విచారణ జరిపి వెళ్లారని, తన కుమారుడికి గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ అలవాట్లు లేవని తెలిపారు. కానీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఆయన కుమారుడు భరత్​రాజ్​ ఐదో నిందితుడిగా ఉన్నాడు. 

హైదరాబాద్ మంగళ్ హాట్‌‌‌‌‌‌‌‌ పీఎస్​పరిధిలో గంజాయి, హాష్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టగా, పురానాపూల్, పోస్ట్ ఆఫీస్ వెనుక ఓ ఇంట్లో గంజాయి, హాష్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు జరుగుతున్నట్లు బయటపడింది.  దాడి చేసిన పోలీసులు రెండో అంతస్తులో ఉన్న అభిషేక్ యాండే(31), బొట్టు యువనీత్(29)ను అదుపులోకి తీసుకుని విచారించారు. అభిషేక్‌‌‌‌‌‌‌‌, యువనీత్‌‌‌‌‌‌‌‌ వద్ద రెండు స్టీల్ బాక్సుల్లో 24 గ్రాముల హాష్ ఆయిల్‌‌‌‌‌‌‌‌, 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్స్ ఆధారంగా వివరాలు సేకరించారు.

అభిషేక్, యువనీత్​ వాంగ్మూలం ఆధారంగా..

అభిషేక్‌‌‌‌‌‌‌‌.. హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని కులు జిల్లా మనాలి గ్రామానికి చెందిన మనోజ్ అనే వ్యక్తి నుంచి హాష్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు దూల్‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన తుల్జాసింగ్‌‌‌‌‌‌‌‌ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించారు. ఇలా సేకరించిన గంజాయి, హాష్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ను తమ స్నేహితులైన భరత్ రాజ్, కౌశిక్, సుగంధి అలియాస్ కునాల్, శుభం సోని సహా మరికొంత మందితో కలిసి సేవిస్తున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. అభిషేక్‌‌‌‌‌‌‌‌, యువనీత్‌‌‌‌‌‌‌‌ ను అరెస్ట్​ చేసి వారి సమాచారం ఆధారంగా భరత్ రాజ్, కౌశిక్, సుగంధి, శుభం సోనిలను కేసులో నిందితులుగా చేర్చారు. అభిషేక్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా భరత్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. భరత్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌తో పాటు మిగితా నిందితులకు నోటీసులు జారీ చేశారు.