శత్రు డ్రోన్లను నేలకూల్చే ‘భార్గవాస్త్రం’...నాగ్​పూర్​ కంపెనీ ఎస్​డీఏఎల్ కీలక విజయం

శత్రు డ్రోన్లను నేలకూల్చే ‘భార్గవాస్త్రం’...నాగ్​పూర్​ కంపెనీ ఎస్​డీఏఎల్ కీలక విజయం
  • స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టం పరీక్ష సక్సెస్​
  • డ్రోన్ గుంపులను అడ్డుకునేందుకు రెండంచెల వ్యవస్థ సిద్ధం 


న్యూఢిల్లీ: శత్రు దేశాల నుంచి దూసుకువచ్చే డ్రోన్ గుంపులను గుర్తించి, నేల కూల్చే స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టం ‘భార్గవాస్త్ర’ పరీక్ష విజయవంతమైంది. మంగళవారం ఒడిశా గోపాలపూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించినట్టు దీనిని అభివృద్ధి చేసిన నాగపూర్ కంపెనీ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్ డీఏఎల్) ప్రకటించింది. ఇటీవల పాక్ నుంచి వందలాదిగా దూసుకువచ్చిన తుర్కియే డ్రోన్లను మన బలగాలు విజయవంతంగా నేలకూల్చాయి. 

అయితే, భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్ దాడుల ముప్పు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వీటిని అతితక్కువ ఖర్చుతోనే సమర్థంగా అడ్డుకునే అధునాతన వ్యవస్థను ఎస్ డీఏఎల్ అభివృద్ధి చేసింది. మైక్రో రాకెట్లు, గైడెడ్ మైక్రో మిసైల్స్ తో ఇది రెండు అంచెల్లో శత్రు డ్రోన్ గుంపులను పేల్చేయగలదు. అంతేకాకుండా జామర్ గా పని చేసి శత్రు డ్రోన్ ల కమ్యూనికేషన్స్ వ్యవస్థను కూడా స్తంభింపచేయగలదని ఎస్ డీఏఎల్ వెల్లడించింది. 

మంగళవారం భార్గవాస్త్రకు మూడు ట్రయల్స్ నిర్వహించగా, అన్ని రకాలుగా ఈ సిస్టం సత్తా చాటిందని తెలిపింది. రెండు వేర్వేరు ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ ను ప్రయోగించగా, అవి టార్గెట్లను ఛేదించాయని పేర్కొంది. మూడో ట్రయల్​లో 2 సెకన్ల తేడాతో రెండు రాకెట్లను ప్రయోగించగా.. అవి కూడా టార్గెట్లను పేల్చివేశాయని వివరించింది. 

ఎలా పని చేస్తుందంటే.. 

భార్గవాస్త్ర సిస్టంలో రాడార్, ఎలక్ట్రోఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఉంటాయి. ఇవి 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని చిన్న చిన్న డ్రోన్లను సైతం గుర్తిస్తాయి. ఇది సీ4ఐ టెక్నాలజీ సాయంతో శత్రు డ్రోన్లతో ముప్పు స్థాయిని అంచనా వేస్తుంది. డ్రోన్ లేదా డ్రోన్ల గుంపును సెన్సర్లు గుర్తించి, ట్రాక్ చేస్తాయి. ఆ వెంటనే ఒక్కో డ్రోన్​ను టార్గెట్ చేయాలా? లేదంటే మొత్తం గుంపును టార్గెట్ చేయాలా? అని ఆటోమేటిక్​గా అంచనా వేస్తుంది. టార్గెట్లను ఫిక్స్ చేసిన తర్వాత తొలుత ఫస్ట్ లేయర్ అటాక్​లో మైక్రో రాకెట్లను ప్రయోగిస్తుంది. ఇవి 2.5 కిలోమీటర్ల పరిధిలోని  డ్రోన్లను ఢీకొట్టి.. చుట్టూ 20 మీటర్ల పరిధిలోని  అన్ని డ్రోన్లనూ కూల్చేస్తాయి. సెకండ్ లేయర్​​లో గైడెడ్ మైక్రో మిసైల్స్ దూసుకెళ్లి టార్గెట్ చేసిన డ్రోన్లను పిన్ పాయింట్​గా ఢీకొడతాయి.  

ప్రత్యేకతలు ఇవే..  

భార్గవాస్త్ర సిస్టంను ఎలాంటి ప్రదేశానికి అయినా ఈజీగా తరలించవచ్చు. 5 వేల మీటర్ల ఎత్తులోని ప్రాంతాలకు సైతం సులభంగా తరలించి వేగంగా మోహరించ వచ్చు. మైక్రో రాకెట్లు, స్మాల్ గైడెడ్ మిసైల్స్ వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతోనే శత్రు డ్రోన్లను కూల్చేయవచ్చు. ఇది రెండు దశల్లో, హార్డ్ కిల్ మోడ్ లో పని చేస్తుంది. శత్రు డ్రోన్లను జామ్ చేయడం లేదా డిజేబుల్ చేయడానికి బదులుగా డైరెక్ట్ గా ఢీకొట్టి పేల్చేస్తుంది. అవసరమైతే శత్రు డ్రోన్ల కమ్యూనికేషన్స్ వ్యవస్థను జామ్ చేసే జామర్ గా కూడా వాడుకోవచ్చు. వివిధ రకాల డ్రోన్లను కూల్చేందుకు అదనపు మార్పులు కూడా చేసుకోవచ్చు.