అంతరాలు తొలగాలంటే.. కులగణన జరగాలి: డిప్యూటీ సీఎం భట్టి

అంతరాలు తొలగాలంటే.. కులగణన జరగాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • సంపదను అందరికీ పంచేందుకు క్యాస్ట్ సెన్సస్ అవసరం: భట్టి 
  • కులగణనపై మేం నిజాయతీగా ఉన్నం:  పొన్నం 
  • క్యాస్ట్ సెన్సస్ పై అధికారులు, బీసీ మేధావులతో సమావేశం 

హైదరాబాద్, వెలుగు:  బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కులగణన జరగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని, ఎక్కువ మంది ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. ధనిక, పేద​అంతరాలు తొలగిపోవాలంటే కులగణన జరగాల్సిందేనని చెప్పారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన కులగణన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి పలు అంశాలపై బీసీ మేధావులు, అధికారులతో భట్టి విక్రమార్క చర్చించారు. వివిధ రాష్ట్రాలతో పాటు బిహార్​లో కులగణన సర్వే చేసి చట్టాలు చేసిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

కులగణనకు సర్కారు కట్టుబడి ఉందన్నారు. ‘‘కులగణన తీర్మానంపై ప్రతిపక్ష సభ్యులు కొందరు దారి తప్పించే ప్రయత్నం చేశారు. కుట్రపూరిత విమర్శలు చేశారు. అయినా మేం కేబినెట్​లో తీర్మానాన్ని ఆమోదింపజేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాస్ చేయించాం’’ అని తెలిపారు. కేవలం పొలిటికల్ రిక్రూట్మెంట్ కోసమే కాకుండా జనాభాకు అనుగుణంగా దేశ సంపదను పంచేందుకు కులగణన అవసరమన్నారు. సంపద ఎక్కడ ఉంది, భూమిలేని నిరుపేదలు ఎందరు, విద్యలో వెనుకబాటు, ఇల్లు లేని వారు.. ఇలా అన్ని అంశాలు కులగణన సర్వేలో వెలుగులోకి వస్తాయన్నారు. బిహార్ లో చేసిన సర్వేలో ఈ అంశాలన్నీ గుర్తించారా? అని అధికారులను ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన తీర్మానం చెయ్యడంపై యూనివర్సిటీల్లో సదస్సులు, సెమినార్లు, మీడియా సమావేశాల ద్వారా బీసీ మేధావులు విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.   

మేం నిజాయతీగా ఉన్నం.. 

అసెంబ్లీలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టడంతో ఒక ఘట్ట౦ ముగిసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘మేం నిజాయతీగా ఉన్నా౦. కేబినెట్​లో భేదాభిప్రాయాలు లేకుండా కులగణన తీర్మానాన్ని ఆమోదించాం. ఈ విషయాన్ని పబ్లిక్ డిమాండ్​లో పెట్టాం’’ అని తెలిపారు. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న విషయం ప్రజలకు అర్థమైందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంతో మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. కులగణన తీర్మానానికి అసెంబ్లీలో ఆమోదం ద్వారా కొత్త ప్రభుత్వం పొలిటికల్ విల్లింగ్ అర్థమైందని ప్రొఫెసర్ మురళీధర్ అన్నారు. 

ఈ అంశాన్ని చివరి వరకు తీసుకెళ్తారన్న నమ్మకం కలిగిందన్నారు. ఒక పెద్ద జాతీయ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కులగణనకు కట్టుబడి ఉండడం విప్లవాత్మకమైన చర్య అని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. కులగణన విజయవంతంగా పూర్తయితే మిగిలిన అన్ని అంశాలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయన్నారు. కింది కులాల పట్ల ఈ ప్రభుత్వానికి నిజాయతీ, నిబద్ధత ఉందని తమకు భరోసా కలిగిందని బీసీ నేత క్రాంతి కుమార్ అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. 

రెన్యువబుల్‌ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

రెన్యువబుల్‌ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలనీ అధికారులకు డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క సూచించారు. శుక్రవారం ప్రజా భ‌వ‌న్‌లో పునరుత్పాద‌క విద్యుత్తు ఉత్పత్తిపై  రెడ్కో అధికారుల‌తో భట్టి స‌మీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  మారుతున్న ప‌రిస్థితులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అందుతున్న ఆర్థిక స‌హ‌కారాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్యరహితమైన రెన్యువబుల్‌   ఎనర్జీ వ‌న‌రుల‌పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 

బ‌హిరంగ స్థలాలు, గవర్నమెంట్‌ ఆఫీసులు, జ‌లాశయాలను గుర్తించి ప్రతిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్నారు. గ్రీన్ ప‌వ‌ర్  జనరేషన్‌లో అన్ని శాఖ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసి త్వర‌లో స‌మీక్ష నిర్వహిస్తామ‌న్నారు. గ‌త ఐదేండ్లుగా రాష్ట్రంలో పునరుత్పాద‌క విద్యుత్తు పాల‌సీ లేక‌పోవ‌డంతో తీవ్రంగా న‌ష్టపోయామని తెలిపారు. ప్రత్యేక‌ పాల‌సీ లేక‌పోవ‌డంతో కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోలేక‌ పోయామ‌న్నారు. అలాగే రాష్ట్రంలో ప‌వ‌న విద్యుత్తు ఉత్పత్తికి ఎంత మేర‌కు అవ‌కాశం ఉంది, ప్రస్తుతం ఏ మేర‌కు ఉత్పత్తి  జ‌రుగుతోంది అన్న వివ‌రాలను భట్టి అడిగి తెలుసుకున్నారు.