ఆర్టీసీకి నిధులిస్తం .. ఫండ్స్ రిలీజ్ చేయాలని ఫైనాన్స్ ఆఫీసర్లను ఆదేశించినం : భట్టి విక్రమార్క

ఆర్టీసీకి నిధులిస్తం .. ఫండ్స్ రిలీజ్ చేయాలని ఫైనాన్స్ ఆఫీసర్లను ఆదేశించినం : భట్టి విక్రమార్క
  • ఫ్రీ స్కీమ్ కింద 6.50 కోట్ల మంది మహిళలు జర్నీ 
  • ప్రత్యామ్నాయ రెవెన్యూను సంస్థ పెంచుకోవాలని సూచన
  • లాజిస్టిక్స్, కమర్షియల్ ఆదాయంపై దృష్టి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు  :  ఆర్టీసీకి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నిర్వహణకు కావాల్సిన నిధులను ఆర్టీసీకి విడుదల చేయాలని ఫైనాన్స్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. బుధవారం సెక్రటేరియెట్‌‌లో ఆర్టీసీపై భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు. 

ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ సాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్‌‌మెంట్లకు సంబంధించిన బకాయిలపై త్వరలో రివ్యూ చేపట్టి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా సంస్థ దృష్టి పెట్టాలని, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద రోజూ సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. 

మహాలక్ష్మి స్కీమ్ ను సక్సెస్ చేస్తున్న సిబ్బంది, అధికారులను అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్టీసీ ప్రజల సంస్థ :  పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ ప్రజల సంస్థ అని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తున్నదని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికెటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు.