ఉపఎన్నికల్లో ఇంఛార్జ్ లుగా మంత్రులా? వాళ్లకేం పని?

ఉపఎన్నికల్లో ఇంఛార్జ్ లుగా మంత్రులా? వాళ్లకేం పని?

ప్రశ్నించే గొంతుక కావాలంటే హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధినే గెలిపించాలని పిలుపునిచ్చారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అందరి దృష్టి హుజూర్ నగర్ ఎన్నికపైనే ఉందని, ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలని ఆయన కోరారు.

ప్రశ్నించే గొంతులపై కేసీఆర్ నిరంకుశంగా అణచివేస్తున్నారని, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు భట్టి. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని, టీఆర్ఎస్ చేసిన ఫిరాయింపులకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

రాష్ట్ర మంత్రులను ఉపఎన్నికల్లో ఇంఛార్జ్ లుగా పెట్టడమేంటి? ఏం చేద్దామని మంత్రులు అక్కడ తిరుగుతున్నారు? అసలు కాంట్రాక్టర్స్ కు అక్కడేం పని? అని భట్టి ఈ సందర్భంగా ప్రశ్నించారు.  ప్రభుత్వ అధికారులు కొందరు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని .. వీటన్నింటిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి రాజ్యాంగ హోదాలో ఉండీ కూడా .. రాజకీయ కాలాపాలు నడుపుతున్నారని భట్టి ఆరోపించారు. గుత్తా తన కొడుకు అమిత్ రెడ్డి కు కాంట్రాక్ట్ లబ్ది కలిగేలా.. అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అమిత్ రెడ్డి గందమల్ల రిజర్వాయర్ లో 7 వందల 19 కోట్ల సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడని భట్టి  అన్నారు. గుత్తా వియ్యంకుడికి 1646 కోట్ల వర్క్ అప్పగించారని ..దీనిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ గవర్నర్ కు లేఖ కూడా రాశారన్నారు. గవర్నర్  దీనిపై స్పందించాలని, సుఖేందర్ తన పదవికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క అన్నారు.