కాంగ్రెస్ లోకి షర్మిల రావడం మంచిదే : భట్టి విక్రమార్క

కాంగ్రెస్ లోకి షర్మిల రావడం మంచిదే : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఇష్టమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొన్ని భావోద్రేకాల వల్ల కొన్ని రోజులు కాంగ్రెస్​కు ఆయన కూతురు షర్మిల దూరంగా ఉన్నా.. ఇప్పుడు మళ్లీ పార్టీకి దగ్గరవడం మంచి విషయమన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆమె కలవడం శుభసూచకమన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. గుడి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని అందిస్తామని తెలిపారు. 

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప.. ప్రజలకు రాష్ట్రంలోని సంపద, వనAరులు అందవన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా డిక్లరేషన్లు, పేదలు, రైతుల కోసం అనేక పథకాలను ప్రకటిస్తున్నామని వివరించారు. రాష్ట్ర బడ్జెట్​ను స్టడీ చేసిన తర్వాతే ఆ స్కీములను ప్రకటించామన్నారు. 

ఉచిత కరెంట్ పేటెంటే కాంగ్రెస్ పార్టీదన్నారు. ఎవరూ ఆలోచన చేయని సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైల్​పైనే చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని అన్నారు. ఇండియా కూటమిలో అన్ని పార్టీలూ చేరినా.. బీఆర్ఎస్ చేరలేదన్నారు. ప్రతిపక్షాల కూటమి ఓట్లను చీల్చేందుకే బీఆర్ఎస్​ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ తెలంగాణలోనే అధికారంలోకి రారన్నారు.