గడువులోపు పనులు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గడువులోపు పనులు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు:  అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మధిర మార్కెట్ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి, గోదాములను పరిశీలించారు.

నిల్వ సామర్థ్యం, నిర్మాణ ప్రమాణాల విషయాన్ని అధికారులతో చర్చించారు. వైరా నదిపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. జూలై ముగిసేలోపు రిటైనింగ్ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పునాది పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. మధిర పట్టణంలోని 11వ వార్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.

అనంతరం మధిరలో ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న మోడల్ మహాప్రస్థానం పనులను భట్టి విక్రమార్క పరిశీలించారు. మధిరను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, రాష్ర్ట గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు 
పాల్గొన్నారు.

పంట అవశేషాలను కాల్చవద్దని అవగాహన కల్పించాలి

ఖమ్మం టౌన్: పంట అవశేషాలను కాల్చవద్దని గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,23,560 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, అందులో 1,12,922 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉందని, మరో 16 వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.