
2023 నాటికి రూ.5 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు
బడ్జెట్ పై పవర్ భట్టి విక్రమార్క పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో సంపద సృష్టి కోసం ప్రభుత్వం అప్పు తేవాలి కానీ, కేసీఆర్ తెచ్చిన అప్పులు పాలకుల మేలుకే అన్నట్టుందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. మన రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలియాలన్నారు. ‘బడ్జెట్ – వాస్తవాలు’ అన్న పేరుతో ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారి మన రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో ప్రజలను మోసం చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఏడాదిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, అందులో 36 వేల కోట్లకు కుదించి మళ్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నారు. లక్షా82 వేల కోట్లతో పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ ను లక్ష 42 వేల కోట్లకు కుదించి 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారాయన. కేంద్ర బడ్జెట్ అంచనాలను పెంచుతూ వెళ్లిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సడన్ గా తగ్గించారని వివరించారు. కేంద్రం పై నెపం నెట్టి తప్పించుకోవడానికే అంచనాలు తగ్గించారని ఆరోపించారు.
రూ.5 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పు
ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాలకు, అప్పుల వడ్డీ వాయిదాల చెల్లింపులకే లక్షా28వేల కోట్లు అవసరమని భట్టి తెలిపారు. రాష్ట్ర రెవెన్యూను లక్షా 13 వేలు గా చూపారని, భూములు అమ్మితే వచ్చే ఆదాయాన్ని కూడా రెవెన్యూలో కలిపారని అన్నారు.
రూ.32900 కోట్లు అప్పు తెచ్చినా ఆస్తుల సృష్టికి మిగిలేది కేవలం 9 వేల కోట్లేన్నారు. 2023 నాటికి రాష్ట్ర అప్పులు 5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని భట్టి విక్రమార్క చెప్పారు.
అన్ని జిల్లాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అప్పులు తెస్తే కానీ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని, స్కీములు కొనసాగించలేని ప్రమాదం ఏర్పడిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో, మేధావుల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం బడ్జెట్ వాస్తవాలను అన్ని జిల్లా కేంద్రాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తానని చెప్పారు.