నువ్వు కట్టిన కాళేశ్వరంలో తోడనీకి నీళ్లేవి : భట్టి విక్రమార్క

నువ్వు కట్టిన కాళేశ్వరంలో తోడనీకి నీళ్లేవి : భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ, వెలుగు : గత వానా కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని.. ప్రస్తుతం ఏ రిజర్వాయర్​లో, ఏ కుంటలో నీళ్లు లేకపోయినా అది కేసీఆర్ పుణ్యమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాలువలో ముందే నీళ్లు పారించి కుంటల్లో తడి లేకుండా చేసిండు. నక్కల గండీ, ఎస్ ఎల్బీసీ, దిండి అలా పాడావ్ పడి ఉండడానికి కేసీఆరే కారణం. ఇవన్నీ ఏడ బయటకు వస్తాయోనని అబద్ధాలు ఆడుతున్నడు. వాస్తవాలు ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు అన్ని తెలిపేలా శ్వేతపత్రం రిలీజ్ చేశాం” అని పేర్కొన్నారు. 

కాళేశ్వరంలో నీళ్లు తోడడం లేదంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని, అయితే వాళ్లు కట్టిన ఆ కాళేశ్వరంలో నీళ్లు ఎక్కుడున్నాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ లో పెండింగ్ లో ఉన్న 10 కి.మీ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నల్గొండ సస్యశ్యామలం అయ్యేదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏదీ సరిగ్గా చేయలేదని.. బీఆర్ఎస్ పాలన, మూడు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్​ చేశారు.

తాను ప్రస్తావించిన అంశాలపై కేసీఆర్ చర్చకు రావాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశం చేసి కాళేశ్వరం, భద్రాద్రి పవర్​ ప్లాంట్​, యాదాద్రి పవర్​ ప్లాంట్​చేపట్టారని, అందులో కాళేశ్వరం కూలిపోగా, భద్రాద్రి ప్లాంట్​ పనికిరాని భారమై, యాదాద్రి ప్లాంట్​ పూర్తి కాకముందే తడిసి మోపెడైందని మండిపడ్డారు. కేసీఆర్ నాశనం చేసిన విద్యుత్, ఆర్థిక వ్యవస్థలను తాము గాడిన పెడుతున్నామని చెప్పారు. కాళేశ్వరంలో ఏం జరిగిందో దేశమంతా చూసిందన్నారు. కమీషన్ల కోసం సబ్‌‌‌‌ క్రిటికల్‌‌‌‌ టెక్నాలజీతో భద్రాద్రి పవర్​ ప్లాంట్‌‌‌‌ చేపట్టారని, యాదాద్రి పవర్ ప్లాంట్ ది ఫెయిల్యూర్ డిజైన్ అని తెలిపారు.

సూర్యాపేటలో కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌‌‌‌ ప్రయత్నించారని, ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. ‘‘కట్టుకథల్లో భాగంగా సూర్యాపేట మీటింగ్​లో సొంతంగా జనరేటర్‌‌‌‌ పెట్టుకున్న కేసీఆర్‌‌‌‌.. జనరేటర్‌‌‌‌ లోపం వల్ల మైక్‌‌‌‌ కట్‌‌‌‌ అయితే కాంగ్రెస్‌‌‌‌ హయాంలో కరెంట్‌‌‌‌ పోయిందంటూ పచ్చి అబద్ధాలకు తెరలేపిండు” అని   ఫైర్​ అయ్యారు. ‘‘విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, నీళ్లు, కాళేశ్వరం గురించి మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క దానిపై కూడా వాస్తవాలు చెప్పకుండా కట్టుకథలు చెప్పి బయటపడేందుకు కేసీఆర్​ ప్రయత్నించిండు.

ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి రాష్ట్రంపై, రాష్ట్ర పాలనపై అక్కసుతో దుమ్మెత్తి పోసిండు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు గత కేసీఆర్‌‌‌‌ పాలనలోని పాపాలే కారణం. పదేండ్లు ఆయన పాలనను గాలికొదిలేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై పెను భారం పడింది. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యే కదా దీనిని కూడా నడపలేరా అంటూ మాపై కేసీఆర్​ మాట్లాడం విడ్డూరంగా ఉంది. కట్టిన ఇల్లును కూల్చేసి పోయిందే ఆయన” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.