భారత పార్లమెంటునే రక్షించలేని పాలకులు.. దేశ ప్రజలను రక్షిస్తారా..? : భట్టి విక్రమార్క

భారత పార్లమెంటునే రక్షించలేని పాలకులు.. దేశ ప్రజలను రక్షిస్తారా..? : భట్టి విక్రమార్క

పార్లమెంటు ఘటనపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. దీనిలో శుక్రవారం (డిసెంబర్ 22న) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఇండియా కూటమి పక్షాల నేతలు ధర్నా చేశారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల తాము తీవ్ర ఆవేదనతో నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర పరిపాలనను చూస్తుంటే  ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడిన భారత పార్లమెంటుపైనా దాడి జరిగితే.. దాని సమాచారం అడిగితే ఎంపీలను సస్పెండ్ చేస్తారా..? అని ప్రశ్నించారు.

దాడి సమాచారం లేదన్నట్లుగా.. ఏమీ జరగలేదన్నట్లు బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే భారతదేశం ఎటువంటి వారి చేతుల్లో ఉందోనని అన్నారు. భారత పార్లమెంటుపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లేనని భావించాలన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారంటే ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఉంటుందా..? అని కామెంట్స్ చేశారు. 

ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడి హక్కు కూడా లేదన్నారు. నియంతృత్వ పోకడల వైపు దేశ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని చెప్పారు. భారత పార్లమెంటునే రక్షించలేని పాలకులు.. దేశ ప్రజలను రక్షిస్తారా..? అని ప్రశ్నించారు. 

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేశ సరిహద్దులో ఏదో ఒక వివాదాన్ని సృష్టించి.. దేశం కోసం ఏదో చేస్తున్నట్లు ప్రజల్లో భ్రమలు కల్పించడం .. దాని ద్వారా అధికారంలోకి రావడం..తప్ప మరో ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. దేశ ప్రజలకు బాసటగా నిలిచిన కాంగ్రెస్ ఎంపీలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.