తెలంగాణ రైజింగ్ వేడుకల్లో అన్ని రకాల పాలసీలు ప్రకటిస్తం : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రైజింగ్ వేడుకల్లో అన్ని రకాల పాలసీలు ప్రకటిస్తం : డిప్యూటీ సీఎం భట్టి
  • రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల  ఆర్థిక వ్యవస్థగా మార్చే రోడ్ మ్యాప్ ​వెల్లడిస్తాం
  • పామాయిల్ వంటి పంటలకూ రుణాలివ్వాలి
  • బ్యాంకర్ల 47వ త్రైమాసిక  మీటింగ్​లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాలను ఈ నెల 8, 9వ తేదీల్లో భారీ స్థాయిలో నిర్వహిస్తామని, ఆ ఉత్సవాల్లో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్​లో నిర్వహించిన బ్యాంకర్ల 47వ త్రైమాసిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీడీపీ వృద్ధి రేటు13 శాతం టార్గెట్​గా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేసేందుకు 2047 రోడ్​మ్యాప్​ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఏటా10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, దానికి ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ పునరుజ్జీవం వంటి అంశాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించబోతున్నామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలతోపాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని, ఆయా రంగాల్లో సీఎస్ఆర్ ఫండ్స్​ను ఖర్చు చేయాలన్నారు.  

రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్లు ముందుండాలి 

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కీలకమైన అభివృద్ధి దశలో ప్రవేశిస్తున్నదని, అందుకు సహకరించేలా బ్యాంకర్లు ముందుండాలని డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క కోరారు. బ్యాంకులు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 49.45% ప్రాధాన్య రంగ రుణాలను సాధించాయని, క్రెడిట్ -డిపాజిట్ నిష్పత్తి 130.18%గా ఉండటం తెలంగాణ ఆర్థిక ప్రయాణంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నదని తెలిపారు. ‘‘మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్​ ఇరిగేషన్, అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలను పెంచాలి. 

పంట రుణాలు సమర్థవంతంగా అందుతున్నా.. వ్యవసాయ రుణాల టర్మ్స్ అవసరానికి తగ్గట్టుగా లేదు. ఈ లోటును బ్యాంకులు భర్తీ చేయాలి’’ అని పేర్కొన్నారు. పామాయిల్​తో పాటు ఇతర విభిన్నమైన పంటలకూ రుణాలు ఇవ్వాలన్నారు. కొన్ని జిల్లాల్లో ఎస్ హెచ్​జీ రుణాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. ‘‘ఎంఎస్‌‌‌‌ఎంఈలకు సీజీటీఎంఎస్ఈ, డిజిటల్ అసెస్మెంట్ పద్ధతుల ద్వారా క్లస్టర్ బేస్డ్ రుణాలను అందించాలి’’ అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో13 వేల కిలోమీటర్ల మేర ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నామని, దీనిని ప్రాధాన్య రంగంగా గుర్తించి రుణాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ రైజింగ్​లో భాగంగా రాబోయే దశాబ్దానికి రోడ్​మ్యాప్‌‌‌‌ను ప్రకటిస్తామన్నారు. గ్రామాభివృద్ధి, బలమైన ఎంఎస్‌‌‌‌ఎంఈ క్లస్టర్లు, అధిక విలువ కలిగిన తయారీ, డిజిటల్ పరిపాలన, గ్రీన్ గ్రోత్ వంటివి తదుపరి దశకు దారితీసే రంగాలు అని పేర్కొన్నారు.