20% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి..వేల కోట్ల లోన్లు తీసుకునే వారికి లేని నిబంధనలు రైతులకెందుకు?: కేటీఆర్

20%  తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి..వేల కోట్ల లోన్లు తీసుకునే వారికి లేని నిబంధనలు రైతులకెందుకు?: కేటీఆర్

ఆదిలాబాద్/నేరడిగొండ/భైంసా, వెలుగు: విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందని.. అందుకే ఇక్కడ పత్తి కొనుగోళ్లకు కొర్రీలు పెడుతున్నదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్ ఆరోపించారు. వేల కోట్ల రుణాలు తీసుకునే వారికి లేని నిబంధనలు రైతులకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీసీఐ రూల్స్‌‌‌‌తో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లే రైతులు కష్టాలపాలవుతున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం కేటీఆర్‌‌‌‌ ఆదిలాబాద్‌‌‌‌, నిర్మల్‌‌‌‌ జిల్లా భైంసాలోని అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్లను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలో క్వాలిటీ పత్తి సాగవుతుందని.. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో వినియోగించుకోవడం లేదన్నారు. 

తాము వస్తున్నామని తెలిసే ఆదిలాబాద్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ను బంద్‌‌‌‌ చేశారని, రైతులను అడ్డుకున్నారని ఆరోపించారు. ‘‘ఆదిలాబాద్‌‌‌‌లో చాలా మంది రైతుల వద్ద స్మార్ట్‌‌‌‌ ఫోన్లు లేవు.. ఇక్కడ ఇంటర్నెట్‌‌‌‌ సరిగా ఉండదు. పనికిమాలిన యాప్‌‌‌‌ తీసుకొచ్చిన్రు. ఆదిలాబాద్‌‌‌‌లో పరిస్థితి ఆగమాగం ఉంది’’ అని అన్నారు. 

పాత విధానంలోనే కొనుగోలు చేయాలి

తేమ పేరుతో రైతుల పొట్టకొడుతున్నారని, ఒక్కో రైతు రూ.1,200 నష్టపోతున్నారని కేటీఆర్​అన్నారు. పత్తిలో 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని, ఎకరానికి 13 క్వింటాళ్ల పత్తిని కొనాల్సిందేనని డిమాండ్‌‌‌‌ చేశారు. బయోమెట్రిక్‌‌‌‌ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే పంటను కొనాలన్నారు. 

ఈ ఏడాది అతివృష్టి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించాలన్నారు. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీసీఐ మేనేజర్‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆయన వెంట  మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌‌‌‌ జాదవ్‌‌‌‌ ఉన్నారు.