పిల్లల్ని అతిగా గారాబం చేస్తున్నారా..? ఇలాంటి పిల్లలే పెద్దయ్యాక ఆత్మహత్యలు చేసుకునేది !

పిల్లల్ని అతిగా గారాబం చేస్తున్నారా..? ఇలాంటి పిల్లలే పెద్దయ్యాక ఆత్మహత్యలు చేసుకునేది !

మనదేశంలో యువతీ యువకులలో చాలా మందికి  నేర, హింసా ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. దిగువ మధ్య తరగతి ప్రజల నుంచి వచ్చిన పిల్లలు ఉపాధి అవకాశాల్లేక, పేదరికం నుంచి బయటపడడానికి నేరాల బాట పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. మధ్య తరగతి  పిల్లలు ఉద్యోగాలు సంపాదించినా, చాలీచాలని జీతంతో కనీస అవసరాలు తీరక అవినీతిపరులుగా మారుతున్నారు. కొంత మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడి తల్లిదండ్రులకు, దేశానికి దూరంగా, అనుబంధాలకు అతీతంగా గడుపుతున్నారు. భారతదేశ  భవిష్యత్తుగాని, సమాజ సంక్షేమంగాని, భావిపౌరులైన బాలబాలికలపైనే ఆధారపడి ఉంది. పిల్లల్ని ఉత్తమ పౌరులను చేసే బాధ్యత తల్లిదండ్రులతో పాటు గురువులదీ !

తల్లిదండ్రుల్లో పాశ్చాత్య పోకడలు
నేటి  జీవనవిధానంలో తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉండడంతో  పిల్లల పెంపకం చాలా క్లిష్టంగా ఉంటోంది.  చాలామంది తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై సరైన అవగాహన ఉండడం లేదు. కొందరు పాశ్చాత్య  పోకడలతో  పిల్లలను పెంచుతున్నారు. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే తీరికలేదు. పిల్లలు పెద్దవుతున్నా వారి స్నేహితుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడంలేదు. పిల్లల్లో చెడు లక్షణాలు ఉన్నట్లే మంచివి కూడా ఉంటాయి. ఆ మంచి లక్షణాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే పిల్లలు మరింత అభివృద్ధి సాధిస్తారు.  రోజులో ఒక్క గంటసేపైనా తల్లిదండ్రులు పిల్లలతో చర్చించాలి.

నైతిక విలువలు తెలియజేయాలి
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతిగా గారాబం చేస్తారు. అలా పెరిగినవారిలో మొండితనం ఏర్పడుతుంది. గర్వం ఏర్పడుతుంది. తీరా వీళ్లు పెద్దయ్యాక తమ మాట చెల్లకపోయినా భరించలేరు. ఇలాంటి వారు బయట ఏ అవమానం ఎదురైనా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఈ మనస్తత్వానికి కారణం వారి తల్లిదండ్రులే. అతి గారాబం మంచిది కాదు. మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను  పనికిరానివారుగా వారిని ఎప్పుడూ శిక్షిస్తూ అవమానిస్తుంటారు. ఇలా అవమానాలు ఎదుర్కొన్న  పిల్లలకు  చిన్నతనం నుంచే  తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది. పెద్దయిన తర్వాత అది సమాజంపై కసిగా మారుతుంది. తల్లిదండ్రుల్లో ఆ ధోరణి మారాలి.

పెద్దలు పిల్లలు చెప్పేది వినాలి 
ప్రతి పిల్లవాడికి వ్యక్తిత్వం ఉంటుంది.  దాన్ని వికసింపచేసుకోవడానికి తగిన ప్రోత్సాహం, ప్రేరణ తల్లిదండ్రులు కలిగించాలి. పెద్దలు పిల్లలు చెప్పే సమస్యలు ఓపికతో  విని పరిష్కరించాలి.  పిల్లలు బయట ఏం చేస్తున్నారో గమనించాలి.  వారి అలవాట్లను గమనించాలి.  క్రమశిక్షణతో  మెలిగేలా శ్రద్ధ తీసుకోవాలి.  పిల్లలముందే తల్లిదండ్రులు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు.  ఇరుగుపొరుగువారి గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేయకూడదు.  పిల్లలు ఒంటరిగా గదిలో కూర్చుని గడుపుతుంటే ఏం చేస్తున్నారో గమనించాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వకుండా ఉండడం ఎంత తప్పో, అతిగా స్వేచ్ఛనిచ్చి వారి గురించి పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు.

ప్రేమపూర్వకంగా క్రమశిక్షణ
పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియ  ప్రేమపూర్వకంగా ఉండాలి.  పిల్లలతో  చాలా స్నేహంగా ఉండాలి.  పిల్లల్లో లోపాల గురించి వారికి చెప్పాలి తప్ప ఈ లోపంవల్ల నువ్వు దేనికీ పనికిరావని అనకూడదు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం వంటివి తగ్గిపోతాయి.

పిల్లలను కూడా గౌరవించాలి 
పిల్లలను కూడా గౌరవించాలని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.    పిల్లల పెంపకం అన్నది గొప్పకళ.  కొన్ని కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దయి ఎంత ప్రయోజనకారులవుతారో,   ఎంత చక్కగా కుటుంబ పద్ధతులను,  సంప్రదాయాలను  గౌరవిస్తారో చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. అందుకు వారి తల్లిదండ్రులను ప్రశంసించాలి. 

కావ్య సుధ