
జూన్ 14 నుంచి హెటెక్స్ లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి భట్టి విక్రమార్క , కోమటి రెడ్డి, జయ సుధ, దిల్ రాజు అటెండ్ అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రొత్సహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. గద్దర తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేశారన్నారు.
గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టం. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయం. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవార్డులు గురించి మాట్లాడుకునేలా వేడుకలు చేస్తాం. చలన చిత్ర అవార్డులతోపాటు వ్యక్తిగత అవార్డులను కూడా పొందుపర్చాం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా అవార్డుల ప్రదానం చేస్తాం అని భట్టి అన్నారు.
గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. లోగో, విధివిధానాలు, నిబంధనల కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ గా బి.నర్సింగ రావును ప్రభుత్వం నియమించింది. కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు వ్యవహరించనున్నారు. అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వి.వెన్నెల, తనికెళ్ల భరణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణ మూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లని శ్రీధర్, సానా యాది రెడ్డి, హరీష్ శంకర్, యల్దండి వేణు (‘బలగం’ చిత్ర దర్శకుడు) సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది.