Telangana Budget 2024: అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తాం: భట్టి విక్రమార్క

Telangana Budget 2024: అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తాం: భట్టి విక్రమార్క
  • ‘కొందరి కోసం అందరు’ కాదు.. ‘అందరికోసం మనందరం’.. ఇదే మా నినాదం: భట్టి విక్రమార్క 
  • ఇష్టారీతిన అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిన్రు 
  • కమీషన్ల కోసం ప్రాజెక్టులు.. కొండలు, గుట్టలకూ రైతుబంధు
  • కొందరికి భరణంగా.. కొందరికి భారంగా ధరణి 
  • దుబారా ఖర్చులు ఉండవ్.. ప్రతి పైసా రాష్ట్ర ప్రజలకే 
  • బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటూ స్వేచ్ఛను సాధించుకున్నారని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంతో మంది యువత త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ.. పదేండ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యమంటే ఏమిటో చూస్తున్నదన్నారు. ‘కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి’ అనే నిరంకుశ విధానాలను ఎదిరించిన రాష్ట్ర ప్రజలు.. నిజమైన అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నారన్నారు. ‘అందరికోసం మనమందరం’ అనే కొత్త స్ఫూర్తితో చిరకాల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు సరైన వేదిక ఏర్పాటైందన్న భావన ప్రజల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తాము చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. శనివారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చాం. నిర్బంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పాం. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం’’ అని భట్టి తెలిపారు.  

గత పాలకుల వల్లే ఆర్థిక కష్టాలు

గత పాలకుల నిర్వాకంతోనే రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర క్లిష్ట ఆర్థిక పరిస్థితులపై ఈ సభకు ఇదివరకే శ్వేత పత్రం ద్వారా సవివరంగా వాస్తవాలను వెల్లడించామని గుర్తు చేశారు. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించామని విక్రమార్క చెప్పారు. ‘‘గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. రాష్ట్ర రాబడిని అధికంగా చేసి చూపడం ద్వారా ఎన్నో పథకాలకు నిధులను కేటాయిస్తున్నామనే భ్రమను కల్పించారు’’ అని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం వాస్తవానికి దగ్గరగానే అంచనాలు రూపొందించిందన్నారు. 

రైతు బంధును దుర్వినియోగం చేసిన్రు

రైతులకు సాయం అందించడం మంచి విషయమే అయినా.. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని దుర్వినియోగం చేసిందని భట్టి ఫైర్ అయ్యారు. ‘‘సాగు చేయని/సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లకు కూడా రైతుబంధు ఇచ్చారు. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతుబంధు ఇచ్చారు” అని ఆయన విమర్శించారు. తాము నిజమైన రైతులకు, కౌలు రైతులకు, అర్హులకే రైతు భరోసా అందిస్తామన్నారు. ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని భట్టి అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిందన్నారు. 
ప్రతి పల్లె కళకళలాడాలె.. 

దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ చెబితే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని భట్టి అన్నారు. ప్రతి పల్లెను అభివృద్ధితో కళకళలాడేలా చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. ప్రతి గ్రామం యూనిట్ గా అభివృద్ధికి ప్రణాళికలు వేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం స్కూలు విద్యార్థులకు యూనిఫామ్ లను, వస్త్రాలను ఒకే చోటు నుంచి కొనుగోలు చేసిందని, ఇకపై ఈ పద్ధతిని మార్చి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్ల హామీని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని భట్టి విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు కార్యాచరణ చేపడుతోందన్నారు. మిషన్ భగీరథపై గత ప్రభుత్వం గొప్పలే చెప్పిందని భట్టి విక్రమార్క విమర్శించారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ సురక్షిత తాగు నీరు అందుబాటులో లేదన్నారు.  

హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే 

రాష్ట్రానికి హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదని, ఆర్థిక వనరులను అందిస్తూ గుండెకాయలా నిలుస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘హైదరాబాద్ కు ఈ ఆర్థిక శక్తిని ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే. రక్షణ రంగ సంస్థలు, ఫార్మా, ఐటీ పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో వరకు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు మొదలుకొని ఓఆర్ఆర్ వరకు.. మంజీరా, కృష్ణా గోదావరి జలాల సరఫరా, 24 గంటల విద్యుత్తు సరఫరా వ్యవస్థ వంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో సృష్టించిన సంపద యావత్తు రాష్ట్ర ప్రజలకు చెందాలి’’ అని భట్టి చెప్పారు.  

ప్రజాపాలనకు శుభారంభం

తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి, నాటి యూపీఏ చైర్ పర్సన్  సోనియా గాంధీకి, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్​కు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకోవడం తమ కర్తవ్యం, అందరి బాధ్యత అని భట్టి విక్రమార్క అన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మరోసారి సభావేదికగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్​ను మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్​గా మార్చి ప్రజా పరిపాలనకు శుభారంభం చేశామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతివారం రెండు రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీల్లోని హామీలను అమలు చేశామన్నారు. త్వరలోనే మరో రెండు హామీలను అమలు చేయబోతున్నామని వెల్లడించారు.  

వ్యవసాయం క్షీణించింది

రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగాలలో ఒకటైన వ్యవసాయం బాగా క్షీణించిందని భట్టి తెలిపారు. ఇతర రంగాలు కూడా వృద్ధి రేటులో తగ్గుదలను నమోదు చేశాయని, తయారీ రంగంలో మాత్రం పెరుగుదల కనిపించిందన్నారు. గత పదేండ్లలో జరిగిన తప్పిదాలు నీటిపారుదల రంగంలో సాధించాల్సిన ప్రగతికి అవరోధాలుగా మారాయని భట్టి అన్నారు. ‘‘కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. అందుకే కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతా లోపం, అవినీతిపై విచారణ జరిపిస్తాం’’ అని భట్టి తెలిపారు.  

యువత జీవితాలు బాగుచేస్తం 

గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యువత భవిష్యత్తుకు తాము గ్యారంటీ ఇస్తున్నామన్నారు. ఇకపై యువత స్వేచ్ఛాయుత తెలంగాణలో, ఆత్మగౌరవంతో బతికేలా చూస్తామన్నారు. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేలా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల  విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని భట్టి అన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ను తిరిగి పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

జయ జయహే తెలంగాణ.. 

ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఈ నెల 4న రాష్ట్ర మంత్రి వర్గ భేటీలో పలు అంశాలను ఆమోదించామని  భట్టి తెలిపారు. ‘‘అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీకి మార్చాం. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ, రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని  నిర్ణయించాం. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి నంది అవార్డులను ‘గద్దర్’ అవార్డుల పేరుతో సినీ, టీవీ కళాకారులకు అందిస్తామన్నారు.