ఒకేలా ఉన్న గుర్తులు : కారుకు టక్కరిచ్చిన రోలర్

ఒకేలా ఉన్న గుర్తులు : కారుకు టక్కరిచ్చిన రోలర్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి 5,219 ఓట్ల ఆధిక్యత
ఇండిపెండెంట్‍ అభ్యర్థికి 27,973 ఓట్లు

యాదాద్రి, వెలుగు: భువనగిరిలో కారుకు రోడ్డు రోలర్‍ టక్కరిచ్చింది. కారును పోలి ఉండడంతో ఓటర్లు తికమకపడ్డట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్‍ అభ్యర్థి సింగపాక లింగంకు ఎన్నికల అధికారులు రోడ్డు రోలర్‍ గుర్తును కేటాయించారు. ఆయన ఎక్కడా ప్రచారం చేసింది లేదు. అయినా 27,973 ఓట్లు వచ్చాయి. భువనగిరి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‍ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి 5,32,795 ఓట్లు రాగా, టీఆర్‍ఎస్‍ అభ్యర్థి డాక్టర్‍ బూర నర్సయ్యగౌడ్ కు 5,27,576 ఓట్లు వచ్చాయి. అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెజార్టీ 5,219 ఓట్లు.  రోడ్డు రోలర్‍ గుర్తు కూడాటీఆర్‍ఎస్‍ ఓటమికి ఓ కారణమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కారు గుర్తు, రోడ్డు రోలర్ గుర్తు ఒకేలా ఉండటంతో ముసలోల్లు ఎక్కువగా కారు గుర్తు అనుకుని రోడ్డు రోలర్ కే ఓటు వేశారంటున్నారు.

ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీఆర్‍ఎస్‍ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్‍ఎస్‍ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతుండేవారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అతడిని ఓడించేందుకు టీఆర్ఎస్‍ ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్‍ నేరుగా పావులు కదిపారు. ఈయనకు తోడు టీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍, జిల్లా మంత్రి జి. జగదీశ్ రెడ్డి, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు తీవ్రంగా శ్రమిం చారు. దీంతో వెంకట్ రెడ్డి ఓటమి చెందాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభావాన్ని చవిచూసిన కాం గ్రెస్‍ అధిష్ఠానం లోక్ సభ ఎన్నికల్లో బలమైన నాయకులను, సీనియర్‍ నేతలను బరిలోకి దింపింది. దీంతో

నల్గొండ నుంచి పోటీ చేయాలనుకొని అనూహ్యంగా చివరి క్షణాల్లో వెంకట్ రెడ్డి భువనగిరి పార్లమెంట్‍ నుంచి పోటీకి దిగారు. వెంకట్ రెడ్డి గెలుపు భాద్యతలను అధిష్ఠానం ఆయన సోదరుడు, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారం కూడా మండల కేంద్రాల వరకే పరిమితమైంది. చివరకు ఖర్చు చేసేందుకు డబ్బుల్లేక చేతులెత్తేసినా చివరకు విజయం సాధించారు.