
బ్యాంకుల్లో అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయిన డిఫాల్టర్ల గురించే ఇంతకాలం విన్నాం. ఇప్పుడొక స్వామీజీ తనపై వచ్చిన రేప్, చీటింగ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోయారు. అంతేకాకుండా, ఒక దీవిని కొనుక్కుని సొంత దేశాన్నే ప్రకటించేశారు. తొమ్మిదేళ్లుగా జనం నోళ్లలో నానుతున్న స్వామి నిత్యానంద దక్షిణ అమెరికాలో ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో ఒక దీవికి రాజట! తన సొంత దేశానికి జెండా, రాజ్యాంగం, పాస్‌పోర్టు సహా అన్ని హంగులు వెబ్సైట్లో పోస్టు చేశారు. అయితే, ఎవరికివారు ‘ఓన్ కంట్రీ’ ఏర్పాటు చేసుకోవడం అంత ఈజీ కాదంటున్నారు ఫారిన్ అఫైర్స్‌పై అవగాహన ఉన్నవాళ్లు.
దేశం విడిచి పారిపోవడం కొత్తేమీ కాదు. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని, కట్టకుండా ఎగ్గొట్టడంకోసం విదేశాలకు పారిపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ, జ్యువెలరీ వ్యాపారి చోక్సీ వగైరా బిజినెస్మెన్ విదేశాల్లో తలదాచుకోవడానికి వెళ్లినవాళ్లు. వీళ్లను మించిపోయిన నిందితుడు అరుణాచలం రాజశేఖరన్ ఎలియాస్ పరమహంస నిత్యానంద ఎలియాస్ స్వామి నిత్యానంద. ఇప్పుడీ స్వామీజీ ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. దక్షిణ అమెరికాలో పశ్చిమం వైపునున్న ఈక్వడార్ దేశం నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సమీపంలో ఉన్న ఒక దీవిని కొనుక్కుని… అక్కడే తన దేశాన్ని ‘కైలాస దేశం’గా స్థాపించి ఒక వెబ్‌సైట్‌ని కూడా ప్రారంభించారు. వ్యక్తులు ఇలా దీవులు కొనుక్కుని ఎవరికి వారే దేశాలు ఏర్పాటు చేసుకోవచ్చునా అనే సందేహం రావచ్చు.
ప్రపంచంలో కొన్ని దేశాలకు మనుషులు నివసించని ఐలాండ్లు చాలా ఉన్నాయి. వాటిని కోట్లకొద్దీ డాలర్లు మూలుగుతున్నవాళ్లు, రొటీన్ లైఫ్‌కి భిన్నంగా గడపాలనుకునేవాళ్లు, పర్యావరణంపై ప్రేమగలవాళ్లు ఆ దీవుల్ని కొనుక్కుంటారు. తమకు నచ్చినట్లుగా మార్చుకుంటారు. వీళ్లలో హాలీవుడ్ యాక్టర్లు, బిజినెస్ టైకూన్లు ఎక్కువగా ఉంటారు. ప్రాపర్టీ డీలర్ల దగ్గర నుంచి చట్టబద్దంగా కొనుక్కుంటారు. కానీ, ఎవరూ ఇలా ఒక దీవిని కొనుక్కుని సొంత దేశంగా ప్రకటించుకున్నవాళ్లు లేరు. తన ‘కైలాస దేశానికి’ స్వామి నిత్యానంద సొంత పాస్‌పోర్టుని, జెండాని, నేషనల్ ఎంబ్లమ్‌ని, జాతీయ చిహ్నం, మృగం, వృక్షం, పశువు, పక్షి, భాష వంటి అన్ని హంగులు నిర్ణయించేశారు.
అంత అవసరం ఏమొచ్చింది?
రాజశేఖరన్ ఎలియాస్ స్వామి నిత్యానందకిప్పుడు 41 ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితమే ఒక సినీ నటితో గడుపుతున్న వీడియో ఒకటి బయటికి రావడంతో దేశమంతటికీ నిత్యానంద గురించి తెలిసింది. తాజాగా ఆయన ఆశ్రమాల్లోనూ, గురుకులాల్లోనూ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలువడ్డాయి. రేప్, చీటింగ్, సాక్ష్యాలు మాయం చేయడం, అసహజ లైంగిక చర్యలు తదితర ఆరోపణలపై కేసులు బుక్కయ్యాయి. కర్ణాటకలోని ఒక కోర్టు కూడా స్వామి అరెస్టుకోసం ఆదేశాలిచ్చింది. తమిళనాడుకు చెందిన భక్తుల పిల్లలు అహ్మదాబాద్‌లో ఉన్న నిత్యానంద గురుకులంలో చదువుకుంటున్నారు. తమ పిల్లల్ని అప్పగించాల్సిందిగా గుజరాత్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని నవంబర్ 10 నాడు గుజరాత్ పోలీసులు ప్రకటించడంతో… దేశమంతా చర్చ సాగింది. అతని పాస్‌పోర్టు 2018లోనే ఎక్స్పైరీ అయ్యింది. రెన్యూవల్ అప్లికేషన్ రిజెక్ట్ కావడంతో, నకిలీ పాస్‌పోర్ట్‌ద్వారా నేపాల్ మీదుగా నిత్యానంద ఇండియా నుంచి పారిపోయినట్లు కనుగొన్నారు. ఒక నిందితుడు అలా ఎలా విదేశాలకు వెళ్లిపోతాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇంతలోనే ఈ నెల మూడో తేదీన స్వామి నిత్యానంద ‘కైలాస దేశం’ ప్రకటన చేయడంతో అందరూ నిర్ఘాంతపోయారు.
కైలాసం ప్రత్యేకతలు
తమిళనాడులోని తిరువణ్ణామలైలో పుట్టిన నిత్యానంద తండ్రి అరుణాచలం, తల్లి లోకనాయకి. ఆయన ప్రకటించుకున్న కైలాస దేశం కచ్చితంగా ఎక్కడున్నదీ తెలియరాలేదు. తన దేశం తరఫున ఆరంభించిన ‘కైలాస డాట్ ఆర్గ్’లోనూ లొకేషన్ చెప్పలేదు. తన దేశపు జెండా, భాష వగైరా చిన్నచిన్న వివరాలు చెప్పారుగానీ, చాలా కీలకమైన కంట్రీ లొకేషన్ చెప్పక పోవడం చిత్రంగా ఉంది. తమది జియలాజికల్ కంట్రీ కాదని, ఐడియాలాజికల్ దేశమని ఆ వెబ్సైట్లో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగాగల 200 కోట్ల ఆది శైవులు తమ దేశాల్లో హిందూయిజాన్ని ఆచరించే అవకాశం ఉండడం లేదని, అలాంటివారికోసమే దేశాన్ని స్థాపించామన్నారు. ఒక పక్క తమది సరిహద్దులు లేని దేశంగా చెప్పుకుంటూనే హోం ల్యాండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ శాఖలను ఏర్పాటు చేయడం విడ్డూరం. కైలాస దేశం నిర్వహణకు డిఫెన్స్‌తో పాటు, హోం, కామర్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫారిన్ మినిస్ట్రీలాంటి 11 శాఖలున్నాయి.
ఐక్యరాజ్య సమితిలో అన్నిటికీ గుర్తింపు దక్కదు
ప్రపంచంలో 197 దేశాలను ఇప్పటివరకు గుర్తించినా, వాటిలో 193 దేశాలకు మాత్రమే ఐక్యరాజ్య సమితి రికగ్నిషన్ ఉండాలి. మిగతా నాలుగు దేశాల్లో వాటికన్, పాలస్తీనాలు అబ్జర్వర్ హోదాలో ఉన్నాయి. న్యూజీలాండ్‌కి అనుబంధంగా ఉన్న న్యూయి, కుక్ ఐలాండ్స్ సమితిలో నాన్–మెంబర్ దేశాలు. సమితిలో సభ్యత్వం పొందాలన్నా, రికగ్నిషన్ పొందాలన్నా మూడు ముఖ్యమైన అర్హతలుండాలి.
పర్మనెంట్ పాపులేషన్ ఉండాలి. నిత్యానంద సిటిజెన్షిప్ కోరుకునేవారు విరాళాలు ఇవ్వాలని తన వెబ్సైట్లో చెబుతున్నారు. అంటే, సిటిజెన్షిప్ని కొంత రేటుకి అమ్ముకోనున్నారు.
ప్రభుత్వం ఉండాలి. స్వామి నిత్యానంద తన దేశానికి 11 శాఖలను వెబ్సైట్లో పెట్టారు.
ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉండాలి. కైలాస దేశానికి ఇప్పటివరకు ఎలాంటి సంబంధాలు లేవు. ఫారిన్ పాలసీకూడా ఏర్పడలేదు.
అంత ఈజీ కానేకాదు?
స్వామి నిత్యానంద అనుకుంటున్నట్లుగా సొంత దేశాన్ని సృష్టించుకోవటం అంత ఈజీయా…? కానేకాదంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. ముఖ్యంగా నాలుగు సమస్యలను సక్సెస్‌ఫుల్‌గా పరిష్కరించుకుంటేనే ఇది సాధ్యమంటున్నారు.
సమస్యలు
ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టని, క్లెయిమ్ చేసుకోని ఫ్రీ ఐలాండ్లంటూ ఏమీ లేవు (ఒకటీ అరా తప్ప).
సార్వభౌమత్వం (సావర్నిటీ), ప్రాదేశిక సమగ్రత(టెరిటోరియల్ ఇంటెగ్రిటీ)లున్న దేశాల దగ్గర మనుషులు నివసించని దీవులు ఉంటాయి. వాటిని మరో దేశం సృష్టించుకోవడానికిగాను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు.
సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అసలు ప్రత్యేక ప్రక్రియ అంటూ ఏదీ లేదు.
స్టార్టప్ కంట్రీకి కొత్తగా జనాభాని పోగుచేయటం కష్టం.
పరిష్కారాలు
ఏ దేశ పరిధిలోకీ రాని కొత్త ప్రాంతాల్ని కనుక్కోవటం అయ్యే పని కాదు. సొంత ఐలాండ్ అనేది ఒక ప్రాపర్టీగానే ఉంటుంది. ఎవరైనా తన ఐలాండ్‌లో దేశం నిర్మించుకోవాలంటే, ఇప్పుడున్న దేశాల సరిహద్దు జలాలకు (జనరల్‌గా సముద్ర తీరం నుంచి 22 కిలోమీటర్లకు) బయట ప్లాన్ చేసుకోవాలి.
కొన్ని దేశాల్లోని ఐలాండ్లను కొనుక్కోవచ్చు. అయితే.. వాటికి ఓనర్లుగానే ఉండొచ్చు గానీ, సెపరేట్ కంట్రీ అంటామంటే మాత్రం ఐలాండ్ అమ్మిన దేశాలు ఒప్పుకోవు. హాంకాంగ్‌ను వదులుకోవడానికి చైనా ఇప్పటికీ సిద్ధంగా లేదు.
ఏదైనా దేశంలో బలమైన లీడర్‌గా ఎదిగి ఆ దేశానికి చెందిన ఒక ఐలాండ్‌ని దాన్నుంచి విడగొట్టి సొంతం చేసుకోవటం గతంలో జరిగింది. నెవిస్, ఈస్ట్ తైమూర్లు ఇలాగే సావర్నిటీని సాధించాయి. అలాంటివాటికికూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గుర్తింపు పొందటం అంత సులభం కాదు.