భార్య నగలమ్మి ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్

భార్య నగలమ్మి ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్
  • ఆటోను అంబులెన్స్‌గా మార్చిన భోపాల్ యువకుడు
  • అందుకోసం భార్య నగలు అమ్మకం
  • కరోనా పేషంట్లను ఉచితంగా ఆస్పత్రులకు చేరవేత
  • ఫోన్ చేస్తే స్పందిస్తున్న ఆటో జావేద్

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో ప్రతిరోజూ నమోదయ్యే కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలోకి ఎంటరైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద సంఖ్య. అదేవిధంగా మరణించిన వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ తాజాగా 2 లక్షలను దాటింది.

ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. అయితే వైద్యులతో పాటు చాలామంది దయార్థహృదయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఈ కరోనా సంక్షోభంలో కరోనా పేషంట్లకు సహాయం చేయడానికి వారు తమ శక్తి కొద్దీ చేతనైనది చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల జాబితాలోకి తాజాగా ఓ ఆటో డ్రైవర్ చేరాడు.

భోపాల్‌కు చెందిన జావేద్ ఖాన్ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్. ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కరోనా పేషంట్లు పడుతున్న ఇబ్బందులను జావేద్ స్వయంగా చూశాడు. దేశవ్యాప్తంగా అంబులెన్సుల కొరత కారణంగా చాలా మంది కరోనా పాజిటివ్ రోగులు మరియు వారి కుటుంబాలు నిస్సహాయంగా ఉండటం చూశాడు. అంబులెన్సులు లేకపోవడం వల్ల పేషంట్లను వారి బంధువులు ఆస్పత్రులకు ఎలా తీసుకెళ్తున్నారో సోషల్ మీడియాలో కూడా చూశాడు. దాంతో కరోనా పేషంట్ల కోసం ఏదైనా చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా తన ఆటోను అంబులెన్సుగా మార్చాలనే ఓ ఆలోచన వచ్చింది. కానీ అలా చేయాలంటే తన దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ ఏదో చేయాలనే తపన అతన్ని ధైర్యం చేసి ముందుకు వెళ్లేలా చేసింది. తన ఆటోను అంబులెన్స్‌గా మార్చడానికి తన భార్య బంగారు ఆభరణాలను విక్రయించాడు. ఆ డబ్బులతో ఆటోలో శానిటైజర్, ఆక్సిజన్ సిలిండర్, పీపీఈ కిట్ మరియు కొన్ని ఔషధాలను ఏర్పాటు చేశాడు. ఇంకేముంది ఆటోతో ఆక్సిజన్ రీఫిల్లింగ్ సెంటర్ ముందు క్యూలో నిలబడి మరీ ఆక్సిజన్ ఫిల్ చేసుకొని.. అంబులెన్స్ లేక ఇబ్బంది పడుతున్న కరోనా పేషంట్లను ఉచితంగా ఆస్పత్రులకు తరలిస్తున్నాడు. 

ఈ విషయంపై జావేద్ స్పందించి.. ‘నేను నా ఆటోను అంబులెన్స్‌గా మార్చాను. ఆటోలో ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశాను. నా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టాను. దాంతో అంబులెన్స్ సదుపాయం లేని పేషంట్ల బంధువులు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు 15 నుంచి 20 రోజులుగా పేషంట్లను ఉచితంగా ఆస్పత్రులకు తరలిస్తున్నాను. ఇప్పటివరకు క్రిటికల్ కండీషన్‌లో ఉన్న 9 మంది రోగులను హాస్పిటల్‌కు చేరవేశాను’ అని తెలిపాడు. జావేద్ చేస్తున్న పనిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మనసులో చేయాలన్న తపన ఉంటే ఎలాగైనా చేయోచ్చని అంటున్నారు.