తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు గుణశేఖర్ అంటేనే మనకు భారీ సెట్టింగ్‌లు, పౌరాణిక గాథలు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ఒక సున్నితమైన , అత్యంత భయంకరమైన సామాజిక ఇతివృత్తంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేటి సమాజంలోని అత్యంత భయంకరమైన ‘డ్రగ్స్’ సంస్కృతిని ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే ‘యుఫోరియా’ మూవీ. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజాన్ని ఆలోచింపజేసే ప్రశ్నలను కూడా సంధించింది.
విచ్ఛిన్నమవుతున్న కలలు
ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. డ్రగ్స్ మత్తులో తూగుతున్న ఒక యువకుడు ఆమెపై జరిపిన అఘాయిత్యం, ఆ అమ్మాయి ఆశయాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఆ తర్వాత చోటుచేసుకున్న ఉత్కంఠభరిత పరిణామాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఎదురుతిరిగిన మాతృమూర్తి
ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. "ఆమె చేసిన నేరం ఏంటి?" అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది.
Also Read : ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఖరారు..
తెరపై మేనన్ మార్క్ ఇన్వెస్టిగేషన్
పోలీస్ కమిషనర్ జయదేవ్ నాయర్‌గా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కేసును ఛేదించే క్రమంలో ఆయన 'పోక్సో' (POCSO) చట్టాన్ని ఎలా ప్రయోగించారు? ఆధారాలను ఎలా సేకరించారు? అనే అంశాలను గుణశేఖర్ ఎంతో సహజంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
నీలిమా గుణశేఖర్ నిర్మాణంలో, కాల భైరవ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. కేవలం డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలనే కాకుండా, బాధ్యతాయుతమైన పేరెంటింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమా చెప్పబోతోంది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ‘యుఫోరియా’, బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి..
