కాల్మొక్త.. మాభూముల్లో రోడ్డు వద్దు

కాల్మొక్త.. మాభూముల్లో రోడ్డు వద్దు

మొగుళ్లపల్లి, వెలుగు: మాకున్న ఒకే ఆధారం వ్యవసాయ భూమే.. దాన్నే నమ్ముకుని మా కుటుంబం బతుకుతోంది.. బాంచన్ కాల్మొక్త మా భూముల్లో ఎలాంటి రోడ్డు వేయొద్దని భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ కాళ్లపై పడి రైతు వేడుకున్నాడు. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు త్వరలో కొత్తగా నిర్మించే నేషనల్ హైవే పనులకు చేస్తున్న సర్వేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మా విలువైన భూముల్లో హైవే నిర్మిస్తే పిల్లలను ఎట్లా సాదుకోవాలె.. ఎట్లా బతకాలె అంటూ ఆర్డీవో కాళ్లపై పడి రైతు మొగిలి వేడుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన మహిళా రైతు మాట్లాడుతూ.. తన భర్త పదేళ్ల క్రితం కరెంట్ షాక్ తో చనిపోయిండని, అప్పటినుంచి ఇద్దరు ఆడపిల్లలను చదివించుకుంటూ బతుకుతున్నానన్నారు. తన ఎకరంన్నరలో నేషనల్ హైవే కింద ఎకరం పోతే ఎదిగిన ఆడపిల్లల పెండ్లి ఎట్లా  చేయాలి.. నేనెట్ల బతకాలంటూ వాపోయింది. ఎకరానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్​వద్దకు వచ్చి మాట్లాడాలని ఆర్డీవో వారికి సర్దిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో హైవే సర్వేను అడ్డుకోవద్దని అన్నారు.