భూపాలపల్లి రూరల్, వెలుగు: విద్యార్థులు కలలు కనాలి, వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 53వ విద్య, వైజ్ఞానిక సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ లో 147 సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులు, 77 ఇన్స్పెర్ ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు టీచర్లతో 13 సైన్స్ ఫెయిర్ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రదర్శించిన ఎగ్జిబిట్లను సందర్శించేందుకు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల విద్య, వైజ్ఞానిక స్టాళ్లు పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీఈవో రాజేందర్, ఎంపీడీవో తరుణి ప్రసాద్, జిల్లా సైన్స్ ఆఫీసర్ స్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
