- పనుల కోసం రూ.50 కోట్ల మంజూరు
- జంక్షన్ల వెడల్పుతో ట్రాఫిక్ సమస్యలకు చెక్
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి పట్టణానికి మహర్దశ పట్టనుంది. అభివృద్ధి పనుల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులకు అడ్మినిస్ర్టేటివ్ సాంక్షన్ రాగా, ఆఫీసర్లు డీపీఆర్ పనుల్లో నిమగ్నమయ్యారు. టెండర్లు పిలిచి పనులు స్పీడప్ చేయనున్నారు.
రూ.50 కోట్లతో డెవలప్..
పట్టణ ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేశారు. ఇటీవల రూ.50కోట్లు కేటాయించగా, గతంలో ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.4 కోట్లతో అసంపూర్తిగా ఉన్న ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు.
నిలిచిపోయిన మంజూర్ నగర్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనుల కోసం రూ.6 కోట్లు, రూ.30 కోట్లతో జయశంకర్ విగ్రహం, జంగేడ్ రోడ్, అటవీశాఖ ఆఫీస్, అంబేద్కర్ జంక్షన్ రెండు వైపుల షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, 5 ఇంక్లైయిన్ జంక్షన్ సమీపంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనానికి రూ.2 కోట్లు, జంగేడు వైకుంఠధామానికి రూ.50 లక్షలు, కోల్ లోడింగ్, ఆన్లోడింగ్ లేబర్యూనియన్ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, రూ.2 కోట్లతో పెద్దకుంటపల్లిలో సీసీ రోడ్, సైడ్‌డ్రైన్ల నిర్మాణం, రూ.5 కోట్లతో అంబేద్కర్ భవనం నిర్మాణం చేపట్టేవిధంగా నిధులు కేటాయించారు. ఆయా పనులు టెండర్ ప్రక్రియ ముగియగానే మార్చినాటికి పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జంక్షన్ల వెడల్పుతో ట్రాఫిక్సమస్యకు చెక్..
భూపాలపల్లి పట్టణంలోని ఇరుకుగా ఉన్న జంక్షన్ల వద్ద పెద్ద వాహనాలు టర్న్ అయ్యే క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో పట్టణంలోని ప్రధానంగా జంక్షన్లను వెడల్పు పనులు చేపట్టనున్నారు. బస్టాండ్ ఎంట్రీ, ఎగ్జిట్ అంబేద్కర్ జంక్షన్ రూ.5 కోట్లతో వెడల్పు చేయడంతోపాటు అంబేద్కర్ జంక్షన్ నుంచి ఓసీ జంక్షన్ వరకు బీటీ రోడ్డు, సైడ్ డ్రైన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
గండ్రపల్లి జంక్షన్ నుంచి మహబూబ్‌పల్లి క్రాస్ వరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు, సైడ్‌డ్రైన్, సెంట్రల్ లైటింగ్, రూ.4 కోట్లతో మీనీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.30 కోట్లతో డెవలప్మెంట్ పనులు కొనసాగుతున్నాయి.
సుందరీకరణపై నజర్..
జిల్లా కేంద్రం శివారు వరకు ఉన్న జాతీయ రహదారి వెంట సుందరీకరణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఆకర్షించే విధంగా లైటింగ్, వాటర్‌ఫాల్స్, ఆకర్షించే పూల చెట్లతోపాటు, ఆహ్లాదాన్ని పంచే పెయింటింగ్స్ఏర్పాటుతో పట్టణానికి కొత్త హంగులు కల్పించనున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు..
పట్టణాభివృద్దికి రూ.50 కోట్లు కేటాయించడంతో అభివృద్ధి స్పీడప్ కానున్నది. పెండింగ్ పనులతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు చేపట్టి మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అమృత్ స్కీం ద్వారా రూ.23 కోట్లతో డెవలప్మెంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని పనులు త్వరగా పూర్తి చేసేలా చూస్తాం. - గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే భూపాలపల్లి
